Nellimarla Constituency: తెలుగుదేశం ( Telugu Desam)పార్టీకి అది బలమైన నియోజకవర్గం. కానీ గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు లభించింది. అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ జనసేన అభ్యర్థికి పూర్తి మద్దతు తెలిపింది. నేతలు బాగానే సహకరించారు. దీంతో జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారిని చేరదీసి ప్రాధాన్యమిస్తున్నారు ఆ ఎమ్మెల్యే. దీంతో రోజు రోజుకు ఆ నియోజకవర్గంలో పరిస్థితి మారుతుంది. కూటమి పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇంతకీ ఏ దాని నియోజకవర్గం అంటే? విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం కూటమి పార్టీల్లో విభేదాలు స్పష్టమవుతున్నాయి. ఇదే అదునుగా అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కూటమి పెద్దలు కలుగజేసుకోకపోతే ఈ నియోజకవర్గంలో పై వచ్చే ఎన్నికల నాటికి ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2009లో ఆవిర్భావం..
2009లో ఆవిర్భవించింది నెల్లిమర్ల( nelli Marla ) నియోజకవర్గం. అంతకుముందు సతివాడ నియోజకవర్గంగా ఉండేది. ఆ నియోజకవర్గంలో నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు పతివాడ నారాయణ స్వామి నాయుడు. వరుసగా అయిదు సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2009లో పునర్విభజన తో నెల్లిమర్ల ఆవిర్భవించింది. తొలి ఎన్నికల్లో ఓడిపోయారు పతివాడ నారాయణ స్వామి నాయుడు. 2014లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. అయితే 8 పదుల వయసు ఉండే ఆయన వయోభారంతో బాధపడుతుండడంతో అక్కడ నియోజకవర్గ బాధ్యతలను టిడిపి సీనియర్ నేత కర్రోతు బంగారు రాజుకు అప్పగించింది హై కమాండ్. ఆయన ఐదేళ్లపాటు పార్టీని ఎంతగానో అభివృద్ధి చేశారు. లోకేష్ పాదయాత్ర ముగింపు కూడా తన నియోజకవర్గంలో నిర్వహించి ఉత్తరాంధ్రలో పార్టీకి ఒక ఊపు రావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ గడిచిన ఎన్నికల్లో ఈ సీటు జనసేన తన్నుకు పోయింది. ఆ పార్టీ అభ్యర్థిగా లోకం కళ్యాణి మాధవి పోటీ చేసి గెలిచారు.
టిడిపి అభివృద్ధికి కృషి చేస్తే..
అయితే ఐదేళ్లపాటు తిరుగులేని నియోజకవర్గంగా తీర్చిదిద్దారు బంగారు రాజు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాల జాబితాలో చేర్చారు. కానీ టిడిపి హై కమాండ్ ఆదేశాలతో 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి మద్దతు తెలిపారు. మద్దతుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లోకం కళ్యాణి మాధవికి కేవలం పదివేల ఓట్లు దక్కాయి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి రికార్డు స్థాయిలో విజయం సాధించారు ఆమె. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక కర్రోతు బంగారు రాజుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే టిడిపి మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే తరువాత టిడిపి శ్రేణులను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. పైగా ఎన్నికల ఫలితాలు తర్వాత చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనసేనలోకి వెళ్లాయి. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని జనసేన ఎమ్మెల్యే వైసీపీ శ్రేణులకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి శ్రేణులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో విభేదాలు తరా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను 20 కోట్ల రూపాయల వరకు నెల్లిమర్ల నియోజకవర్గానికి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పనులు జరిపించడంలో టిడిపి కంటే వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారికి ప్రాధాన్యం లభిస్తుంది అన్న విమర్శ ఉంది. రోజురోజుకు ఇక్కడ పరిస్థితి దిగజారుతుండగా కూటమి పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలానే కొనసాగితే మాత్రం ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ దక్కి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కూటమి పెద్దలు ఆ ఇరువురు నేతలను పిలిచి మందలించారు. అయినా సరే అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇలా అయితే కూటమికి ఆ నియోజకవర్గంలో కష్టమే.