Avatar Fire and Ash Review: నటీనటులు: శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ కింగ్, సిగొర్నీ వీవర్, కేట్ విన్ స్లెట్ తదితరులు.
సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్
ఛాయాగ్రహణం: రసెల్ కార్పెంటర్
దర్శకత్వం: జేమ్స్ క్యామెరూన్
నిర్మాణం: లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ క్యామెరూన్ రూపొందించిన అవతార్ 2009 లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా అవార్డుల పంట కూడా పండించింది. విజయం సాధించిన ఉత్సాహంతో అవతార్ కు కొనసాగింపుగా జేమ్స్ క్యామెరూన్ నాలుగు పార్టులు ప్రకటించాడు. రెండవ భాగం అవతార్: ది వే ఆఫ్ వాటర్ 2022 రెండులో విడుదలైంది. రెండవ భాగం కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ చాలామంది ప్రేక్షకులు పెదవి విరిచారు. రిపీట్ అయినట్టుగా ఉందని, టెక్నికల్ అంశాలు తప్ప మిగతా అంతా సోదిగా ఉందని విమర్శలు వచ్చాయి. అయితే అవతార్ ఫ్రాంచైజీ అభిమానులు మాత్రం ఆహా ఓహో, వన్స్ మోర్ అంటూ పొగడ్తలు గుప్పించారు. అవతార్ సీరీస్ లో మూడవ భాగమైన అవతార్: ఫైర్ అండ్ యాష్ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భాగం ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఉసూరుమనిపించిందా అనేది రివ్యూ లో చూద్దాం.
పండోరా ఆక్రమణకు గురికావడంతో జేక్(శామ్ వర్తింగ్తటన్)- నెయిటిరి(జో సల్దానా) జంట తమ పిల్లలతో కలిసి మెట్కయినా తెగతో కలిసి జీవిస్తూ ఉంటారు. వీరితో పాటు ఉన్న దత్తపుత్రుడైన స్పైడర్ ను ఒక సేఫ్ ప్లేస్ లో వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో వీరున్న ప్రాంతానికి ఫ్లైయింగ్ మర్చంట్ షిప్స్ రావడంతో, స్పైడర్ ను వదిలిపెట్టాలని జేక్ కుటుంబంతో సహా వారి షిప్పులో బయలుదేరతారు. ఈ ప్రయాణం ఎన్ని మలుపులు తీసుకుంది? దారిలో వీరిని చంపాలని చూసే నావి తెగ(వీరినే యాష్ తెగ అంటారు) వారితో ఎలా పోరాడారు? మరోవైపు జేక్ ను అడ్డుకోవాలని చూసే మనుషుల ఆర్మీ ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది తెరపై చూడాలి.
పండక్కి ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడని నాలుగు స్వీట్స్ పెడతాం. వాటిలో జిలేబి బాగుంది.. ఇలాంటి జిలేబి ఎప్పుడు నేను తినలేదు.. అద్భుతం అన్నాడు. దీంతో ఇంకో జిలేబి.. మరో జిలేబి, ఏక్ ఔర్ జిలేబి అంటూ తినమని బలవంతపెడితే వాడి పరిస్థితి ఏమవుతుందో సరిగ్గా ప్రేక్షకుల పరిస్థితి అలానే అయింది. ఒక అవతార్ బాగుంది అద్భుతం అన్నారు. ఇక చూసుకో మీ అంతు చూస్తాను అన్నట్టుగా నాలుగు అవతార్లు తీస్తాను అంటూ దర్శకుడు ప్రేక్షకులపై దాడి చేయడం మొదలు పెట్టాడు. హిట్టు చేస్తూ పోతే నలభై అవతార్లు తీసేలా వున్నాడు గురుడు. సీరీస్ లో వచ్చిన సెకండ్ పార్ట్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ చూసినవాళ్ళలో చాలామంది సీన్స్ అన్నీ రిపీట్ గా ఉన్నాయని, తెరపై మూడు గంటల పాటు ఆ వానరుల లాంటి మనుషులను చూడలేకపోతున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఫైర్ అండ్ యాష్ లో కూడా ఇలాగే ఆకాశంలో ఎక్కువ సీన్స్ అదే రకంగా రిపీటెడ్ అనిపించాయి.
నిజానికి అవతార్ కథ మొదటి పార్ట్ లోనే అయిపోయింది కానీ దర్శకుడు మాత్రం దాన్ని జీడిపాకంలా సాగాదీయలని కంకణం కట్టుకున్నాడు. దాని వల్ల కథలో డెప్త్ పూర్తిగా మిస్సయింది. ఎప్పుడైతే కథలో డెప్త్ లేదో సినిమాలో హై ఇచ్చే ఎలిమెంట్స్ లేకుండాపోయాయి. ఎంతసేపూ విజువల్ ఎఫెక్ట్స్ చూడండి అంటే ఏం చేసుకోవాలి వాటిని? కథను, పాత్రలను, సన్నివేశాలను ఎలివేట్ చేసే అంశమే విజువల్ ఎఫెక్ట్స్. అంతే కానీ ఉత్త విజువల్ ఎఫెక్ట్స్ తో మూడున్నర గంటలు థియేటర్ లో కూర్చోబెట్టాలంటే అది ఎవ్వరి వల్లా కాదు. అసందర్భమే అయిన మరో హాలీవుడ్ సీరీస్ ను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘జురాసిక్ పార్క్’ కొన్ని దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా చరిత్రకెక్కింది. అయితే అదే జురాసిక్ పార్క్ కు ఇబ్బడి ముబ్బడిగా సీక్వెల్స్ వచ్చాయి కానీ మొదటి భాగం స్థాయిలో మరొక్క పార్ట్ దారిదాపులకు కూడా చెరలేకపోయింది. ఈ అవతార్ కూడా రాను రాను అలానే ఏడ్చింది. అవతార్ బ్రాండ్ ను చూపించి డబ్బులు పిండుకునే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు.
కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు పూర్తిగా మైనస్. కథను సాగదీయాలనిపించినప్పుడల్లా ఒక్కో కొత్త తెగను పరిచయం చేయడం చిరాకు తెప్పిస్తుంది. అసలే అవన్నీ వింత జీవులు, కథ కాకరకాయ లేకుండా ఎంతసేపు ఎగిరే గరుడపక్షి లాంటి పక్షులను, నీటిలో తిమింగలం లాంటి తిమింగలాలను చూడగలరు? మొదటి అవతార్ విడుదలై ఇప్పటికి పదిహేనేళ్ళు దాటింది. ప్రేక్షకుల అభిరుచులు కూడా పూర్తిగా మారిపోయాయి. దీనికి తోడు పాత్రల పేర్లు, తెగల పేర్లు నోరు తిరగకుండా ఒక యాభై వరకూ ఉన్నాయి. ఎవరు ఎవరో గుర్తించేలోపు కొత్త వాళ్ళు వచ్చేస్తారు. ఇదో రకం గోల. ఇదంతా స్క్రిప్ట్ లోని లోపాలే. ఈ సినిమాలో గొప్పగా ఉన్నవి, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్. నిజానికి ఈ సినిమాకు 3.17 నిముషాల నిడివి అవసరం లేదు. ఆ ఎడిటర్ కనీసం గంట సేపు సినిమాను కత్తిరించి పారేసినా నష్టమేమీ ఉండేది కాదు. కనీసం ప్రేక్షకులను టార్చర్ అన్నా తగ్గేది.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. నటీ నటులు అందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, రోనల్ పాత్రలో కేట్ విన్ స్లెట్ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
అవతార్, జేమ్స్ క్యామెరూన్ పేర్లు చెప్పగానే పులకించిపోయే డై హార్డ్ ఫ్యాన్స్ కు తప్ప మిగతావాళ్ళకి మాత్రం ఇది ప్రత్యక్ష నరకమే.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. బలహీనమైన కథ
2. రిపీట్ అనిపించే సన్నివేశాలు
3. హై ఇచ్చే సీన్స్ లేకపోవడం
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. విజువల్ ఎఫెక్ట్స్
2. విజువల్ ఎఫెక్ట్స్
3. విజువల్ ఎఫెక్ట్స్
4. సంగీతం
ఫైనల్ వర్డ్: అవతారంగా ఏడ్చింది
రేటింగ్: 1. 5 /5