Homeఆంధ్రప్రదేశ్‌AP - Other States : పొరుగు రాష్ట్రమే తీపి..  ఏపీలో అంతా బ్రాంతి

AP – Other States : పొరుగు రాష్ట్రమే తీపి..  ఏపీలో అంతా బ్రాంతి

AP – Other States : ఏపీ ప్రజలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. చదువులు, ఉపాధి, ఉద్యోగాలు ఇలా ఒకటేమిటి అన్నింటికీ పక్క రాష్ట్రాలవైపే చూస్తున్నారు. చివరకు ఎంజాయ్ చేసేందుకు సైతం పొరుగు మద్యంను ఆశ్రయిస్తున్నారు. చదువుకుందామంటే సరైన ప్రోత్సాహం లేదు. పనిచేసుకుందామంటే పరిశ్రమల జాడలేదు. చివరకు షాపింగ్ చేద్దామంటే ధరలు దగ్గరగా లేవు. పోనీ వికెండ్ రోజు సరదాగా మందుకొడతామన్నా సరైన బ్రాండ్ లభించడం లేదు. ఇలా అన్నింటా ఏపీ బ్రాండ్ పడిపోతోంది. జాతీయ స్థాయిలో నవ్వులపాలవుతోంది.

చదువులకు ఫస్ట్ చాయిస్ పొరుగు రాష్ట్రాలకే ఇస్తున్నారు. ఇంటర్, ఆపై చదువుకు ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ, కర్నాటక, తమిళనాడులకే. ఏమాత్రం ఆర్థిక స్థోమత లేని వారు మాత్రం ఎలాగోలా ఇక్కడే చదివేస్తున్నారు. అందుకే పొరుగున ఉన్న తెలంగాణ హాస్టళ్లు కిటకిటలాడుతున్నాయి. ఏపీలో మాత్రం వెలవెలబోతున్నాయి. తెలంగాణ ఎంసెట్ లో ర్యాంకులు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అంతా ఏపీ విద్యార్థులే ర్యాంకర్లుగా ఉండడం పరిస్థితిని తెలియజేస్తోంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల వారు హైదరాబాద్ లో, తమిళనాడుకు దగ్గరగా ఉన్న వారు చెన్నైలో, కర్నాటకకు దగ్గర్లో ఉన్నవారు బెంగళూరులో తమ పిల్లలను చదివిస్తున్నారు.

పోనీ స్థానికంగా ఉండి ఉద్యోగం చేద్దామంటే అదీ లేదు. ఒక్క పరిశ్రమ ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. ఉపాధితోనైనా నెట్టుకొస్తామంటే రియల్టర్లు ఏపీని విడిచిపెట్టి వెళుతున్నారు. కొత్త పరిశ్రమల జాడలేదు. ఉన్న పరిశ్రమలకు గ్యారెంటీ లేదు. నచ్చలేదని ఒకరు.. నేతల వేధింపులకు మరొకరు తమ వ్యాపార సామ్రాజ్యాలను పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అమరావతి ఆగిపోవడంతో 50 వేల మందికి ఉపాధి గగనమైంది. కొత్తగా పట్టాలు పుచ్చుకున్న నిరుద్యోగ యువత  బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వైపు అడుగులేస్తున్నారు.

చివరకు ఇంట్లో శుభకార్యం జరిగితే షాపింగ్ కు కూడా ఇతర రాష్ట్రాలబాట పట్టాల్సిన దౌర్భాగ్య స్థితి ఏపీకి దాపురించింది. రెట్టింపైన పన్నులతో రూ.100కు దొరకాల్సిన వస్తువు రూ.150 అందుకే ఎందుకొచ్చింది గొడవ అంటూ చాలామంది షాపింగుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. ఇక మద్యం గురించి ఎంత చెబితే అంత తక్కువ. ఉత్తరాంధ్ర వాసులు ఒడిశాకు, రాయలసీమ వాసులు బెంగళూరుకు, కోస్తా వాసులు తెలంగాణ సరిహద్దులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఏ వర్గంలో చూసినా సంతృప్తి కనిపించలేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular