Nara Lokesh Meets PM Modi: ఢిల్లీ ( Delhi) కేంద్రంగా ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ తరచూ ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాలుగు నెలల వ్యవధిలోనే లోకేష్ రెండుసార్లు ప్రధాని మోదీని కలిశారు. అయితే ఒక సాధారణ రాష్ట్ర మంత్రికి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఇక్కడ కీలక పాయింట్. రాష్ట్రాల ముఖ్యమంత్రులకే కలిసేందుకు ప్రధాని అపాయింట్మెంట్ లభించడం కష్టం. అటువంటిది మంత్రి నారా లోకేష్ కు అపాయింట్మెంట్ దక్కుతుండడం వెనుక ఏంటి కథ అనేది ప్రధాన చర్చగా నడుస్తోంది. అయితే లోకేష్ ప్రధానిని కలిసిన ప్రతిసారి రాష్ట్రం కోసమేనని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సైతం రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ ప్రాజెక్టుల కోసమేనని చెబుతూ వస్తోంది. అయితే దాని వెనుక బిజెపి భారీ వ్యూహం ఉందని తెలుస్తోంది. గతంలో జరిగిన తప్పిదాన్ని తెలుగుదేశం పార్టీ సరి చేసుకునే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.
ఏడాదిలో మారిన సీన్
తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) 2019 నుంచి 2024 మధ్య సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం. అది పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహాయపడింది. ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏ కు దూరమయ్యారు బిజెపికి పరోక్షంగా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు తీవ్ర నష్టం చేసింది. 2018 ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు అయ్యారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ సమయంలో లోకేష్ పడిన తపన అంతా ఇంతా కాదు. ఢిల్లీలో రోజుల తరబడి ఉండిపోయి తండ్రి బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో హోం మంత్రిగా ఉన్న అమిత్ షా అపాయింట్మెంట్ కోసం తెగ ప్రయత్నం చేశారు. కానీ అపాయింట్మెంట్ దక్కలేదు. కానీ ఏడాది తిరిగేసరికి అదే లోకేష్ కు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇట్టే లభిస్తోంది.
నాలుగు నెలల్లో ఇది రెండోసారి..
నాలుగు నెలల వ్యవధిలో మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh) ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఇది రెండోసారి. విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు.. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ.. లోకేష్ ను దగ్గరకు తీసుకున్నారు. ఢిల్లీకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో లోకేష్ ఈ ఏడాది మేలో కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు రెండు గంటలసేపు గడిపారు. తాజాగా మరోసారి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు గంట సేపు సమావేశం అయ్యారు నారా లోకేష్. రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని లోకేష్ కోరినట్లు టిడిపి అనుకూల మీడియా రాసుకొచ్చింది. దానికే అయితే నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవనక్కర్లేదన్నది ఒక అభిప్రాయం. ఎప్పటికీ సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తరచూ వెళ్లి కేంద్ర అధికారులకు కలుస్తున్నారు. కేంద్ర మంత్రులకు కలుస్తుండడంతో ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది.
ఉభయ పార్టీల ప్రయోజనం..
ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి నారా లోకేష్ తరచూ కలుస్తుండడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడు నారా లోకేష్. గత అనుభవాల దృష్ట్యా బిజెపితో లాంగ్ ట్రావెల్ చేయాలని టిడిపి భావిస్తోంది. మరోవైపు జాతీయ రాజకీయ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీని శాశ్వత మిత్రుడిగా చేసుకోవాలని చూస్తోంది. ఇలా రెండు పార్టీల పరస్పర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీని నారా లోకేష్ తరచూ కలుస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.