Chandrababu new strategy: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) వైసీపీ ఓటు బ్యాంక్ పై ఫోకస్ పెట్టారా? వైసీపీకి బలమైన ప్రాంతంలో చెక్ చెప్పాలని భావిస్తున్నారా? అందులో కొంత సక్సెస్ అయ్యారా? అదే ఊపును కొనసాగించాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈనెల 10న అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. తద్వారా రాయలసీమ జిల్లాలకు బలమైన సంకేతాలు పంపించనున్నారు. గతంలో రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి మైనస్ అని చెప్పుకునేవారు. కానీ గడిచిన ఎన్నికల తర్వాత పూర్తి సీన్ మారింది. ఇదే స్ఫూర్తిని 2029 ఎన్నికల వరకు చాటాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సీన్ రివర్స్..
2019 ఎన్నికల్లో రాయలసీమలో( Rayalaseema) తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం మూడు స్థానాల్లో మాత్రమే. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. అటు తరువాత ప్రతి ఎన్నికలోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. అయితే 2019 నుంచి 2024 మధ్య రాయలసీమ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. స్వల్ప సంఖ్యలో మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఓ ఆరు చోట్ల మాత్రమే రాయలసీమలో ఆ పార్టీ ప్రభావం చూపింది. టిడిపి కూటమి దాదాపు రాయలసీమలో స్వీప్ చేసింది. అప్పటినుంచి చంద్రబాబుతో పాటు నారా లోకేష్ స్పెషల్గా దృష్టిపెట్టారు రాయలసీమపై. ఒకవైపు రాజకీయంగా.. ఇంకోవైపు అభివృద్ధి పరంగా రాయలసీమపై ఫుల్ ఫోకస్ చేశారు తండ్రీ కొడుకులు. దాని సత్ఫలితాలు వస్తుండడంతో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించారు.
కడప నడిబొడ్డులో మహానాడు..
గతంలో ఎన్నడూ లేని విధంగా కడప( Kadapa) నడిబొడ్డులో మహానాడు నిర్వహించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల్లో గెలుపునకు అదే నాంది అయింది. వైసిపి ఆరోపిస్తున్నట్టు అధికార పార్టీ దుర్వినియోగం చేసినా.. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకపోవడం గమనార్హం. ఇదే పట్టు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అందుకే కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకెళ్లి సస్యశ్యామలం చేయాలనుకున్నారు. ఇంకోవైపు పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. పనిలో పనిగా ఈ నెల 10న అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సభను ఉభయగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించారు. కానీ రాయలసీమలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలంటే అక్కడే నిర్వహించడం కరెక్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చారు.