Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: అమిత్ షాతో లోకేష్.. ‘బాబు’కు విడుదల ఉంటుందా?

Nara Lokesh: అమిత్ షాతో లోకేష్.. ‘బాబు’కు విడుదల ఉంటుందా?

Nara Lokesh: ఎట్టకేలకు లోకేష్ కల ఫలించింది. కేంద్ర పెద్దలను కలుసుకోగలిగారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిలిపివేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తండ్రిని కలుసుకున్నారు. అనంతరం జనసేన అధినేత పవన్ తో కలిసి మరోసారి తండ్రిని పరామర్శించారు. అనంతరం పవన్ పొత్తు ప్రకటన చేశారు. అటు తరువాత లోకేష్ ఢిల్లీ పయనమయ్యారు. దాదాపు మూడు వారాలకు పైగా అక్కడే గడిపారు. అరెస్టు భయంతోనే ఆయన ఢిల్లీ వెళ్లిపోయారని ప్రత్యర్థులు ఆరోపిస్తుండగా.. లోకేష్ మాత్రం అన్ని కేసుల విచారణకు హాజరవుతూ వచ్చారు. అటు తండ్రి కేసు విషయంలో ఢిల్లీలో సుమాలోచనలు జరిపారు.

చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో ఆది నుంచి క్వాష్ పిటీషన్ వైపే లోకేష్ మొగ్గు చూపారు. ఏసీబీ, హైకోర్టులలో చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో ఢిల్లీలో ఉంటూ కేసు పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చారు. సుమారు 16 మంది సీనియర్ లాయర్లతో సమన్వయం చేసుకుంటూ లోకేష్ ముందుకు సాగారు. వారి సలహా, సూచనలతో కేసులో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. అదే సమయంలో తన పై నమోదైన కేసుల విచారణకు హాజరవుతూ వచ్చారు.

కోర్టుల్లో చంద్రబాబుకు ఊరట దక్కకపోవడంతో లోకేష్ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇన్ని రోజులు కేంద్ర పెద్దలను సైతం కలుసుకోకపోవడంతో రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతాయి. అదే సమయంలో చంద్రబాబు అరెస్టులో కేంద్ర పెద్దల పాత్ర ఉందని అర్థం వచ్చేలా జగన్ మాట్లాడారు. టిడిపి శ్రేణులు సైతం అదే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఈ తరుణంలో లోకేష్ కేంద్రమంత్రి అమిత్ షా ను కలుసుకోవడం విశేషం. తన పెద్దమ్మ, బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా అమిత్ షాను కలుసుకున్నారు. తన తండ్రి అరెస్టు, తనపై కేసులు, చివరికి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు తదితర విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లగలిగారు.

చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు బలంగా ఉండేవి. కానీ లోకేష్ మాత్రం తాము అలా భావించడం లేదని చెప్పడం ద్వారా ఒక అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగారు. చంద్రబాబు బయటకు వచ్చే మార్గాలను వెతకడంలో బాగానే పనిచేస్తున్నారన్న నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమి కట్టాయి. బిజెపి ఇందులో కలుస్తుందన్న ఆశాభావం రెండు పార్టీల్లో ఉంది. ఇప్పుడు లోకేష్ అమిత్ షాను కలవడం ద్వారా బిజెపి సైతం సానుకూలంగా ఉందన్న సంకేతం వస్తోంది. అటు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్ పై రేపు విచారణ జరగనుంది. సానుకూల తీర్పు వస్తే మాత్రం ఏపీ రాజకీయాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అలా జరిగితే అది కేంద్ర పెద్దల సహకారంతో జరిగిందన్న ప్రారంభమవుతుంది. మొత్తానికైతే లోకేష్ అనుకున్నది కొంతవరకు సాధించుకోగలిగారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular