Nara Lokesh focuses on Rayalaseema: పులివెందులలో( pulivendula ) గెలిచి తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. కడప అడ్డాలో పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీం వర్క్ చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని ఈ విజయం తేల్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో పట్టు బిగించేందుకు ఇప్పటినుంచి ప్రయత్నాలు ప్రారంభించింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైతే టిడిపి జెండా పట్టుకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందో.. అక్కడే జెండా పాతేందుకు ఇప్పటి నుంచే వ్యూహాల రూపొందిస్తోంది. ముఖ్యంగా పులివెందుల, పుంగనూరు, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరులో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను మంత్రి నారా లోకేష్ కు టిడిపి నాయకత్వం అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది.
ఆ విషయంలో మైనస్..
వాస్తవానికి చంద్రబాబుకు( CM Chandrababu) ఒక లోటు ఉంది. ఆయన రాయలసీమ జిల్లాకు చెందిన నేత. చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తూ వచ్చారు. అటువంటి నేతపై పట్టు బిగించేందుకు రాజశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతలు ప్రయత్నాలు చేశారు. వారి వారసులకు బాధ్యతలు అప్పగించారు. 2014 నుంచి 2024 మధ్య రాయలసీమలో రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా నడిచింది. అటు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా కీలక భూమిక పోషించింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో సైతం పెద్దిరెడ్డి కుటుంబం నిలిచింది. అయితే వారితో పోల్చుకుంటే చంద్రబాబు ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రతిపక్ష నేతగా కొనసాగారు. కానీ రాయలసీమకు వచ్చేసరికి బలమైన ఉనికి చాటుకోలేకపోతున్నారు. ఆ లోటును తీర్చేందుకు నారా లోకేష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాయలసీమ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
రాయలసీమ పై ఫోకస్..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పరంగా, కూటమిపరంగా కూడా రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు చంద్రబాబు. మొన్నటికి మొన్న టిడిపి మహానాడు రాయలసీమలోనూ, అందులోనూ కడపలో నిర్వహించి సత్తా చాటారు. తాజాగా కూటమి సక్సెస్ సభను కూడా ఈనెల 10న రాయలసీమలో నిర్వహించనున్నారు. ఇంకోవైపు చంద్రబాబుతో పాటు లోకేష్ తరచూ రాయలసీమలో పర్యటిస్తున్నారు. మొన్నటికి మొన్న కడపలో పర్యటించారు లోకేష్. ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. రాయలసీమలో పేరు మోసిన రాజకీయ కుటుంబ వారసులతో లోకేష్ గట్టి సంబంధాలే కొనసాగిస్తున్నారు. తద్వారా రాయలసీమలో బలమైన నాయకుడిగా తయారై.. చంద్రబాబుకు ఆ లోటు లేకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పట్టు కోసం ప్రయత్నాలు..
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా భయపెట్టడం వంటివి లేకుండానే.. పోలింగ్ జరిగి టీడీపీ కూటమి విజయం సాధించేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. గతంలో ఎక్కడైతే టిడిపికి కనీసం ఉనికి లేకుండా పోయిందో.. వైసీపీ నేతలు బెదిరించారో.. అటువంటి చోట టిడిపి కూటమి జెండాలు పాతాలని లోకేష్ గట్టి ప్లాన్ తో ఉన్నారని తెలుస్తోంది. మరి ఎలాంటి ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తారో చూడాలి.