Nandamuri Taraka Rama Rao House In Chennai: నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ).. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆయన దూరమై మూడు దశాబ్దాలు దాటుతున్నా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయనకు సంబంధించినది ప్రతిదీ ప్రత్యేకమే. అందుకే ఇప్పుడు ఆయన నివసించిన చెన్నైలోని ఇంటికి పూర్వ వైభవం తీసుకొచ్చే పనులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మహనీయుడు ఇంటిని ప్రజలు సందర్శించేందుకు వీలుగా అనుమతించనున్నట్లు ప్రచారం నడుస్తోంది. చెన్నై నగరంలోని త్యాగరాయ నగర్ లోని బజుల్ల రోడ్డులో సుమారు 1000 గజాల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంటుంది. 1953లో ఎన్టీఆర్ సత్యమని బసవతారకం పేరుతో ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇల్లు ఎన్టీఆర్ కు సెంటిమెంట్ అని.. ఆయనకు ఎంతో కలిసి వచ్చింది అన్న ప్రచారం ఉంది. అయితే కార్యక్రమంలో హైదరాబాద్కు చిత్ర పరిశ్రమ షిఫ్ట్ కావడం.. ఎన్టీఆర్ కుటుంబం అంతా హైదరాబాదులో స్థిరపడడంతో ఈ ఇంటిని పట్టించుకునే వారు కరువయ్యారు.
* సన్నిహితులకు ఇల్లు..
నందమూరి తారక రామారావుకు దాదాపు 30 మంది వారసులు ఉన్నారు. ఇందులో చిత్ర పరిశ్రమలో( cine industry) కొనసాగుతున్న వారు కొందరైతే.. వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న వారు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు. చెన్నై ఇంటి విషయంలో వారసుల్లో సానుకూలత రాకపోవడంతో ఆ ఇంటిని పట్టించుకునే వారు కరువయ్యారు. కానీ ఇటీవల కుటుంబం అంతా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి సన్నిహితులు, సమీప బంధువులైన చదలవాడ బ్రదర్ ఆ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్కు స్మారకంగా ఈ ఇంటిని సుందరంగా తీర్చిదిద్దేందుకు చదలవాడ బ్రదర్స్ నడుం బిగించినట్లు తెలుస్తోంది.
* సందర్శనకు వీలుగా..
ఎన్టీఆర్ ముచ్చటపడి ఈ ఇంటిని కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా దర్శకుడు దాసరి నారాయణరావు ( Dasari Narayana Rao) ఇల్లు ఉండేది. ఎన్టీఆర్ తో ఎన్నో హిట్ చిత్రాలు రూపొందించారు దాసరి. దాసరి తన బృందంతో రాత్రిళ్ళు కూర్చుని ఎన్టీఆర్ తో కథా చర్చలు జరిపేవారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఎన్టీఆర్ లేచి దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టేవారు. అందుకే ఆ రెండిళ్లలో ఎప్పుడూ లైట్లు వెలుగుతూనే ఉండేవని అప్పట్లో టాక్ నడిచేది. అందుకే ఆ వీధిలో ఏ ఇంటికి కూడా వాచ్ మాన్ ఉండరని అప్పట్లో చెప్పుకునేవారు. కానీ హైదరాబాద్కు చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అయిన తర్వాత దాసరి నారాయణరావు సైతం భాగ్యనగరానికి వచ్చేసారు. ప్రస్తుతం దాసరి నారాయణరావు ఇల్లు ఉన్న ప్రాంతం షాపింగ్ కాంప్లెక్స్ గా మారింది. ఎన్టీఆర్ నివాసం అప్పట్లో అభిమానులతో రద్దీగా ఉండేది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఎక్కువగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లేవారు. తమ అభిమాన నటుడిని ఆరాధ్య భావంతో చూసేవారు. అందుకే ఆ ఇంటిని పూర్వ వైభవం దిశగా మార్చాలని చదలవాడ బ్రదర్స్ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఆ ఇంటి ముందు ఫ్లైఓవర్ ఉంది. దాని పైనుంచి సైతం ఇల్లు కనిపించేలా ప్రధాన ద్వారం వద్ద దుర్యోధనుడి పాత్రలో కనిపించే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు వీక్షించే వీలుగా ఇంటిని మార్పు చేస్తున్నట్లు చదలవాడ బ్రదర్స్ చెబుతున్నారు.