Kiran Kumar Reddy: రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆయన ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత రోశయ్య సీఎం అయ్యారు.

Written By: Dharma, Updated On : February 24, 2024 10:46 am

Kiran Kumar Reddy

Follow us on

Kiran Kumar Reddy: రాష్ట్రంలో పొత్తులపై క్లారిటీ వస్తోంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టడం ఖాయంగా తేలుతోంది. ఇప్పటికే ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తయిందని టాక్ నడుస్తోంది. ప్రధానంగా బిజెపికి అసెంబ్లీ సీట్లు కంటే ఎంపీ సీట్లు అధికంగా కేటాయిస్తారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 400 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని బిజెపి భావిస్తోంది. ఏపీకి సంబంధించి పొత్తులో భాగంగా కనీసం ఐదు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలను ఆశిస్తోంది. ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అందుకే ఈసారి కీలక నాయకులను ఎంపీ అభ్యర్థులుగా బరిలోదించేందుకు కసరత్తు చేస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆయన ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత రోశయ్య సీఎం అయ్యారు. కొద్ది రోజులు పాటు ఆ పదవిలో కొనసాగారు. కానీ హై కమాండ్ అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టింది. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చారు. కొద్ది రోజుల కిందట తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కానీ అక్కడ ఇమడలేక బిజెపిలో చేరారు. బిజెపి నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్రమంత్రి కావాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేనతో బిజెపి పొత్తు ఉండడంతో రాజంపేట ఎంపీ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

2014లో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకున్న సమయంలో రాజంపేట ఎంపీ స్థానం నుంచి పురందేశ్వరి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. గత రెండు ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగితే గట్టి ఫైట్ ఉంటుంది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లా వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ చీఫ్ వీప్ గా, స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనూహ్యంగా సీఎం పదవి సైతం వరించింది. అయితే గత పది సంవత్సరాలుగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. కిరణ్ పోటీ చేస్తే ఆ కుటుంబంలో ఇద్దరు బరిలో దిగినట్టు అవుతుంది. మరి ఎంతవరకు సాధ్యమో చూడాలి.