AP Cabinet: ఏపీలో ఇద్దరు మంత్రులను తప్పిస్తారా? కొత్తవారికి అవకాశం ఇస్తారా? నాగబాబు తో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు? గత కొద్ది రోజులుగా ఇదే ఆసక్తికర చర్చ. పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారని.. ఉత్తరాంధ్ర నుంచి కిమిడి కళా వెంకట్రావు తీసుకుంటారని.. రాయలసీమ నుండి రెడ్డప్పగారి మాధవి రెడ్డి అని.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డికి అవకాశం ఇస్తారని.. ఇలా లేనిపోని ప్రచారం నడిచింది. రాయలసీమ జిల్లాకు చెందిన మంత్రిని తొలగిస్తారని.. ఉత్తరాంధ్ర జూనియర్ మంత్రిపై వేటు తప్పదని.. ఇలా రకరకాల టాక్ అయితే నడిచింది. కానీ అటువంటిదేమీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటువంటి సాహసం చంద్రబాబు చేయరని తేల్చి చెబుతున్నారు. తాజాగా దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అది తప్పుడు ప్రచారంగా ఖండించారు.
* మరో ఇద్దరు ప్రమాణం
ఏపీలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్. 24 మంది మంత్రులు కొలువుదీరారు. మంత్రివర్గంలో ఒక బెర్త్ ఖాళీగా ఉంచారు. దానిని నాగబాబుతో భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే నాగబాబు తో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. పెద్దగా పనితీరు కనబరచిన ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి చంద్రబాబు తొలగిస్తారని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాకు చెందిన ఒక మంత్రి, గోదావరి జిల్లాకు చెందిన మరొకరు, ఉత్తరాంధ్రకు చెందిన ఓ జూనియర్ మంత్రి పేరు ప్రముఖంగా వినిపించింది. వారిని తొలగించి సీనియర్లకు అవకాశం ఇస్తారని కూడా ప్రచారం నడిచింది.
* ప్రభుత్వం నుంచి కనిపించని సన్నాహాలు
జనవరి 8న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ప్రభుత్వం నుంచి అటువంటి సన్నాహాలేవీ లేకుండా పోయాయి. అదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయింది. వాస్తవానికి నాగబాబు కు ఈపాటికే మంత్రివర్గంలోకి తీసుకోవాలి. ఆయన ఏ సభల్లోనూ ప్రతినిధి కారు. అందుకే మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీగా నాగబాబును ప్రకటించి క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా అదే. అదే సమయంలో ఇద్దరు ముగ్గురు మంత్రులను తొలగిస్తారు అన్న ప్రచారం కూడా తప్పు అని తెలుస్తోంది. అటువంటి ఆలోచన సీఎం చంద్రబాబుకు లేదని అంతరంగీకులు సైతం చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.