Nagababu: పవన్ కళ్యాణ్( Pawan Kalyan) హెచ్చరికలు గట్టిగానే పని చేస్తున్నట్టు కనిపించాయి. జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ గట్టిగానే హెచ్చరికలు చేసినట్లు వార్తలు వచ్చాయి. విదేశీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తిప్పి కొట్టడంలో ఎందుకు చూపడం లేదని నేరుగా పార్టీ నాయకులను ప్రశ్నించారు పవన్. ముఖ్యంగా నాగబాబు తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆడవారి వస్త్రధారణ పై మాట్లాడటానికి సమయం ఉంటుంది కానీ.. పార్టీ అధినేత పై విమర్శలు చేస్తున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు అని నాగబాబును పవన్ ప్రశ్నించినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు స్పందించారు. ముఖ్యంగా లడ్డూ వివాదం పై మాట్లాడారు. దాదాపు 6:30 నిమిషాల వీడియోలో వైసీపీని ఓ లెవెల్ లో వేసుకున్నారు. అన్ని కోణాల్లో ఏకిపారేశారు నాగబాబు.
* ఇచ్చి పడేసిన మెగా బ్రదర్..
గత ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు( Nagababu ). త్వరలో ఆయన రాష్ట్ర మంత్రి కావడం ఖాయం. అయితే గతంలో దూకుడుగా ఉండేవారు. కానీ ఇటీవల కొంత స్లో అయ్యారు. దానిని గుర్తు చేస్తూ పవన్ నాగబాబు పై సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఓ వీడియో విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తానేమీ నాస్తికుడిని కాదంటూ నాగబాబు నాలుగు మాటలు చెప్పారు. 2020 వైసీపీ హయాంలో అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం గురించి ప్రశ్నించారు. ఆరోజు వైసిపి నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వ్యక్తుల జీవితాల మీద ఉండే ఆసక్తి.. హిందూ దేవాలయాలపై ఎందుకు ఎందుకు ఉంటుందిలే అంటూ ఎద్దేవా చేశారు. రామతీర్థం ఘటన గురించి ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు మంత్రులకు రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద శ్రద్ధ.. రాముడు మీద ఎందుకు ఉంటుందిలే అని సెటైర్ వేశారు. పనిలో పనిగా అయోధ్య రామ మందిరం గురించి కూడా మాట్లాడారు. ఏపీ నుంచి ప్రభుత్వ పెద్దలు వెళ్లారా అంటూ గుర్తు చేశారు. హిందువులపై ఎక్కడా లేని ప్రేమ వలకబోస్తున్న వైసిపి.. ఒక్క ట్వీట్ కానీ.. వీడియో కానీ బయట పెట్టారా అంటూ ప్రశ్నించారు. కనీసం మీ స్టాండ్ ఏంటో కూడా ప్రజలకు చెప్పే దమ్ము లేదు అంటూ ఆక్షేపించారు. ఎదుటివారిని అభినందించే సంస్కారం కూడా లేదని వ్యాఖ్యానించారు.
* అబ్దుల్ కలాం కంటే గొప్పవాడివా?
తిరుమలలో డిక్లరేషన్ పై( declaration) ప్రత్యేకంగా మాట్లాడారు నాగబాబు. ఆనాడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. టిటిడి సంప్రదాయాలను గౌరవించారని ప్రస్తావించారు. కలాం కంటే జగన్ గొప్పవాడా అంటూ ప్రశ్నించారు. బోర్డు మీటింగ్లో అప్పటి చైర్మన్ వై వి మాటలను ప్రస్తావించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల పై వైసీపీ చేసిన దోపిడీ అంతా ఇంత కాదన్నారు. ఎక్కడ కొండ కనిపించిన గుండు కొట్టాలన్నదే వైసీపీకి అలవాటైన విద్యగా అభివర్ణించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో రేపు మాట్లాడుతానని ముగించారు నాగబాబు. అయితే ఒక్కసారిగా నాగబాబు విరుచుకు పడడం చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై జనసేన ఎదురుదాడి ప్రారంభమైనట్టే.