Nagababu: ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు హస్తిన పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్రంలోఅధికారం చేపట్టడానికి అవసరమైన సీట్లు బిజెపికి దక్కలేదు. దీంతో మిత్రుల అవసరం బిజెపికి అనివార్యంగా మారింది. ముఖ్యంగా ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. దీంతో చంద్రబాబుకు ఢిల్లీలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. ఏపీలో కూటమికి పవన్ కారణం కావడంతో ఆయనకు సైతం సరైన గౌరవం లభిస్తోంది. ఒకవైపు క్యాబినెట్ కూర్పు జరుగుతుండగానే మరో ఆసక్తికర విషయం బయటపడింది. మెగా బ్రదర్ నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీటీడీ చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది. ఆ పదవిపై టిడిపి తో పాటు బిజెపి నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. ఆయనకే ఖాయం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన సమన్వయానికి, ప్రచారానికి నాగబాబు పరిమితం అయ్యారు. ఒకానొక దశలో ఆయనఅనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎలమంచిలిలో ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. సుమారు రెండు వారాలపాటు ప్రచారం కూడా చేశారు. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ సీటు బిజెపికి కేటాయించారు. అప్పట్లో ఈ నిర్ణయానికి మనస్థాపానికి గురైన నాగబాబు హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ అటు తరువాత నాగబాబు యాక్టివయ్యారు. పిఠాపురంలోపవన్ తరుపున ప్రచారం చేశారు. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ తో పాటు భార్య సైతం పిఠాపురంలో పర్యటిస్తూ పవన్ కుమద్దతుగా ప్రచారం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటించారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. పార్టీ శ్రేణులకు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు.
2019 ఎన్నికల్లో జనసేన తరఫున నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేశారు నాగబాబు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడిన రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. సరిగ్గా ఎన్నికలకు రెండేళ్ల ముందు తిరిగి జనసేనలో యాక్టివ్ గా మారారు. నరసాపురం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రచారానికి పరిమితం అవుతానని నాగబాబు తేల్చి చెప్పారు. ఇంతలో అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి నాగబాబు పేరు వినిపించింది. తరువాత కాకినాడ నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. మరోసారి మచిలీపట్నం ఎంపీ స్థానానికి కూడా పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడిచింది. కానీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు నాగబాబు.ఎన్నికల్లో టిడిపి కూటమి విజయం వెనుక పవన్ కృషి ఉందని అందరికీ తెలిసిన విషయమే.అందుకే పవన్ కు ఇటు చంద్రబాబుతో పాటు అటు బిజెపి అగ్ర నేతలు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ నేపథ్యంలోనే నాగబాబు పేరు టిటిడి చైర్మన్ పదవికి పరిశీలించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు పవన్ ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ తూర్పు తో పాటు కేంద్రంలో మంత్రి పదవుల కేటాయింపు పై జోరుగా చర్చలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నాగబాబు విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపునకు మెగా కుటుంబం సహకరించిన నేపథ్యంలో.. తగిన గౌరవం ఇవ్వాలని చంద్రబాబుతో పాటు కేంద్ర పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టీటీడీ చైర్మన్ పదవి కోసం చాలామంది టీడీపీ, బిజెపి నేతలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నాగబాబుకు ఆ పదవి కేటాయించడంతో వారు ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే ఎప్పుడూ లేనంత గౌరవం మెగా కుటుంబానికి దక్కడం విశేషం. మెగా అభిమానుల్లో సైతం ఒక రకమైన జోష్ కనిపిస్తోంది.