MVS Murthi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి ఉంది. ఆ పార్టీ బలం పెంచుకున్నట్లు ఊహిస్తోంది. కానీ చాలా చోట్ల పార్టీకి సరైన నాయకత్వం లేదు. ఇప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జులు బాధ్యతలు తీసుకోవడం లేదు. పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులు కొద్దిమంది మాత్రమే. మిగతావారు రకరకాల కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ముంగిట చూసుకోవచ్చు కదా అని భావిస్తున్న వారు ఉన్నారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన నేతలు సైతం ఇప్పుడు పెద్దగా బయటకు రావడం లేదు. ఇప్పుడు వస్తే పార్టీ ఖర్చులు చూడాల్సి వస్తుందన్న భయంతో ఉన్నవారు కూడా ఉన్నారు. దాదాపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఉంది. మంత్రి పదవులతో పాటు ఎంపీ పదవులు చేపట్టి ఆర్థికంగా బలపడిన వారు సైతం ముఖం చాటేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా ఇలానే ముఖం చాటేసిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి ఇప్పుడు యాక్టివ్ అవుతుండడం విశేషం. అయితే విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థికంగా గట్టి నేత..
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంవీఎస్ మూర్తి ఉండేవారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మూర్తి 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థికంగా స్థితిమంతుడు తో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో కీలకమైన విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు. టిడిపి అభ్యర్థిగా శ్రీ భరత్ అప్పట్లో పోటీలో నిలిచారు. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రంగంలోకి దిగారు. కేవలం త్రిముఖ పోటీ కావడంతో.. ఎంపీగా తక్కువ మెజారిటీతో విజయం సాధించారు మూర్తి. కానీ ఐదేళ్ల వైసిపి పాలనలో సొంత పార్టీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి మూర్తికి.
ఓడిన తరువాత..
2024 ఎన్నికల్లో ఎంవీఎస్ మూర్తి అభ్యర్థిత్వాన్ని మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన స్థానంలో బొత్స ఝాన్సీ లక్ష్మిని తెచ్చారు. ఎంవీఎస్ మూర్తిని విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెట్టారు. ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు టిడిపి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన ఎంవీఎస్ మూర్తి అయితే గెలుస్తారని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు మూర్తి. అయితే ఓడిపోయిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండిపోయారు.. ఒకానొక దశలో పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడిచింది. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీలో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. అందుకు కేడర్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అదే పనిగా నాయకత్వానికి టచ్ లోకి వెళ్తున్న మూర్తిని త్వరలో ఏదో ఒక నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
