Annadaata sukheebhava : రైతులకు సాగు పెట్టుబడి ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు? ఇప్పుడు అందరి నోటా ఇదే వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతు సాగుకు 20వేల రూపాయలు సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతోంది.కానీ సాగు పెట్టు బడికి సంబంధించి అప్డేట్ ఇంతవరకు రాలేదు.దీంతో అసలు పథకం అమలు చేస్తారా?లేదా? అసలు ఆ ఉద్దేశం ఉందా?అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.వైసిపి హయాంలో వైయస్సార్ రైతు భరోసా పథకం కింద రైతుకు ఏడాదికి రూ.13,500 ఆర్థిక సాయాన్ని అందించేవారు. 2019 ఎన్నికలకు ముందు ఏడాదికి 15000 అందిస్తానని జగన్ ప్రకటించారు. కానీ దానిని 13,500 కు పరిమితం చేశారు. అయితే ఇందులో కూడా కేంద్రం ఇచ్చిన 6000 రూపాయల నగదు ఉంది. ఈ లెక్కన అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 7500 రూపాయలు మాత్రమే. ఏటా మేలో 5000 రూపాయలు, జనవరిలో రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో 2000 చొప్పున అందించేది. అయితే తాము అధికారంలోకి వస్తే 20వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనికి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్సైట్లో పేరును మార్చారు. కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. అయితే నెలలు గడుస్తున్నా సాయం పై మాత్రం ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
* ఖరీఫ్ ప్రారంభమైనా
ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులకు పైగా దాటుతోంది.ఇంతవరకు అన్నదాత సుఖీభవ సాయం పై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.కనీసం సన్నాహాలు కూడా ప్రారంభించలేదు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వరదలతో పంటలకు నష్టం జరిగింది. రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
* గత ఐదేళ్లుగా అమలు
సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం పరిపాటి. కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో సకాలంలో రైతు భరోసా నగదును జమ చేసేవారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం మారడంతో ఇంతవరకు నగదు జమ కాలేదు. ప్రభుత్వం కనీసం ప్రకటన చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వెబ్సైట్ పేరును మాత్రం మార్చారు. కొన్ని రకాల మార్గదర్శకాలు జారీ చేశారు. అంతకుమించిన పని అంటూ ఏమీ చేయలేదు.
* కౌలు రైతులకు వర్తింపు
మరోవైపు కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ సాయం అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గతంలో రైతు భరోసా పథకం కేవలం భూ యజమానులకి దక్కింది. భూమి వారి పేరిట ఉండడంతో వారి ఖాతాలోనే నగదు జమ అయ్యింది. ఇప్పుడు కౌలు రైతులకు వర్తింప చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఓటాన్ బడ్జెట్ కొనసాగుతోంది. అందుకే సంక్రాంతి నాటికి రైతులకు సాగు పెట్టుబడి కింద.. అన్నదాత సుఖీభవ పేరిట సాయం అందించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.