Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ లో కీలక ట్విస్ట్. ఆయన వైసీపీలో చేరడం లేదు. బిజెపిలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. వైసీపీ తరఫున ప్రతినిధులు సైతం ముద్రగడను కలిశారు. ఇక కుమారుడితో కలిసి వైసీపీలో చేరడం లాంఛనమేనని అంతా భావించారు. ఈ నెల 12న వైసీపీలో చేరతారని ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ఆయనకు వైసీపీలో చేరడం ఇష్టం లేదని తెలుస్తోంది. బిజెపి నేతలు ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారని విమర్శ ఉంది. అందుకు తగ్గట్టే ఆయన వ్యవహార శైలి నడిచింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం పుణ్యమా అని చంద్రబాబు సర్కార్ పై కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీకి దగ్గరయ్యారు. అటువంటి కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నఫలంగా ముద్రగడ నిలిపివేశారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ కు అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే కుమారుడికి వైసిపి ద్వారా పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని ముద్రగడ భావించారు. కానీ జగన్ ముద్రగడ కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు వెనుకడుగు వేశారు. ఇది ముద్రగడ ఆగ్రహానికి కారణమైంది.
ఒకానొక దశలో ముద్రగడ జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. నేరుగా పవన్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తారని టాక్ నడిచింది. అయితే అటువంటిదేమీ లేకపోవడంతో ముద్రగడ మనస్థాపానికి గురయ్యారు. నేరుగా పవన్ కు లేఖ రాశారు. మీతో పని చేయాలని ఉన్నా.. నిస్వార్ధంగా సేవలందించాలని భావించినా ఆ అవకాశాన్ని ఇవ్వలేదని పవన్ ను ఆక్షేపించారు. దీంతో వైసీపీ నేతలు లైన్ లోకి వచ్చారు. ఎంపీ మిధున్ రెడ్డి నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్లి వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన చేరిక దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది.
అయితే ముద్రగడ వేరే ఆలోచనతో ఉన్నట్లు కొత్తగా ఇప్పుడు ప్రచారం ప్రారంభమైంది. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ ముద్రగడ వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదని.. ఆయన టిడిపి,జనసేన, బిజెపి కూటమిలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు. గతంలో ముద్రగడ బిజెపిలో పని చేశారు. పార్టీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. అందుకే ముద్రగడ బిజెపి వైపు మొగ్గు చూపించి ఉంటారని టాక్ నడుస్తోంది. పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తారని.. ఆస్థానం నుంచి ముద్రగడ పోటీ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే ముద్రగడ ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి బిజెపి కోర్టులో చేరిందన్నమాట.