https://oktelugu.com/

Mudragada Padmanabham : అది మోసం కాదా? చంద్రబాబుపై ముద్రగడ సంచలన కామెంట్స్

ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఆ పార్టీలో పదవులు అనుభవించిన వారు ఇప్పుడు మాట్లాడడం లేదు. అనూహ్యంగా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన చాలామంది నేతలు సైతం సైలెంట్ అయ్యారు. కానీ అందులో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు బయటకు వచ్చారు. చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

Written By: Dharma, Updated On : November 15, 2024 2:44 pm
Mudragada Padmanabham

Mudragada Padmanabham

Follow us on

Mudragada Padmanabham : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. అలియాస్ పద్మనాభరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు ముద్రగడ. ఆయనకు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం బాధ్యతలను అప్పగించారు జగన్. అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తానని శపధం చేశారు ముద్రగడ. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేశారు. అంతటితో ఆగకుండా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో ముద్రగడ చుట్టూ వివాదాలు, సెటైర్లు ప్రారంభమయ్యాయి.పద్మనాభ రెడ్డిగా పేరు ఎప్పుడు మార్చుకుంటారని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు, ప్రధానంగా జనసైనికులు ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ముద్రగడ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. మరోవైపు ఆయన కుమార్తె జనసేనలో చేరారు. పవన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు కూడా ముద్రగడ సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల జగన్ పిఠాపురం వెళ్లారు. అక్కడ కూడా ముద్రగడ కనిపించలేదు. దీంతో ముద్రగడ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం సాగింది. అయితే దానికి చెక్ చెబుతూ ఈరోజు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు ముద్రగడ.

* ఈసారి పవన్ ప్రస్తావన లేకుండా
సాధారణంగా ముద్రగడ మీడియా ముందుకు వచ్చినా, పత్రికా ప్రకటన విడుదల చేసినా.. డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావన ఉండేది. కానీ ఈసారి చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు ముద్రగడ. చంద్రబాబును అబద్దాల చక్రవర్తిగా అభివర్ణించారు. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు నెరవేర్చుతారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. పథకాలు అమలు చేయకుండా తిరుపతి ప్రసాదం, రెడ్ బుక్, సోషల్ మీడియా పోస్టింగులు అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోసం చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబు గారు అంటూ సెటైర్ వేశారు. పనిలో పనిగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టులను ఖండించారు. అమాయకులను జైలులో పెట్టి కొట్టించడం మంచిది కాదు అని కూడా పేర్కొన్నారు.

* అధినేత పట్టించుకోవట్లేదు
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడను అందరూ లైట్ తీసుకున్నారు. చివరకు వైసీపీ అధినేత జగన్ కూడా. పిఠాపురంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ క్రియాశీలక నాయకుడిగా ముద్రగడ ఉన్నారు. మొన్న వరద ప్రాంతాల్లో పర్యటన కోసం జగన్ పిఠాపురం వెళ్లారు. దాదాపు ముద్రగడ ఇంటి పక్క నుంచి వెళ్ళిపోయారు కానీ.. అటువైపుగా చూడలేదు. జగన్ పర్యటనలో ముద్రగడ కూడా కనిపించలేదు. అదే సమయంలో ముద్రగడ కుమార్తె జనసేనలో చేరారు. దీంతో ముద్రగడ క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనని ప్రచారం సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో తాజాగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.