Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham: ముద్రగడతో వైసీపీకి నష్టమా? లాభమా?

Mudragada Padmanabham: ముద్రగడతో వైసీపీకి నష్టమా? లాభమా?

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభంతో వైసీపీకి లాభమా? నష్టమా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. కేవలం కాపు సామాజిక వర్గం నుంచి జరిగే నష్టాన్ని నియంత్రించేందుకు ముద్రగడను వైసీపీలో చేర్చుకున్నారు జగన్. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపునకు అవసరమైన వ్యూహాలను అమలు చేయాలని సూచించారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు టర్న్ అయ్యేలా చూడాలని కోరారు. అయితే ముద్రగడ వ్యవహరిస్తున్న తీరుతో పవన్ హైలెట్ అవుతున్నారు.

కాపు సామాజిక వర్గం నేతగా, కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం కు మంచి పేరు ఉంది. అందుకే జగన్ సైతం వైసీపీలోకి రప్పించారు. ముద్రగడతో వైసీపీకి కాపు ఓట్లు మళ్ళించేలా ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ వ్యాఖ్యలు చూస్తే దారుణంగా ఉంటున్నాయి. పవన్ పిఠాపురంలో ఓడిపోకపోతే తన పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని శపథం చేశారు. అయితే కుల ఉద్యమ నాయకుడిగా.. తన పేరు చివర తోకను.. మరో కులానికి జత చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేందుకు కాపు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శ ముద్రగడపై ఉంది. ఇప్పుడు అదే రెడ్డి పేరును.. తన పేరు చివరన పెట్టుకుంటానని చెప్పడం కొంచెం అతిగా మారింది.

తన విషయంలో ముద్రగడ అనుచితంగా ప్రవర్తిస్తున్నా పవన్ మాత్రం.. ముద్రగడ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. జనసేనలో చేరేందుకు ముద్రగడ కుమార్తె, అల్లుడు ముందుకు వచ్చినప్పుడు పవన్ సున్నితంగా వారించారు. ముద్రగడను పల్లెత్తు మాట అనకుండా సహనాన్ని ప్రదర్శించారు. ఆయన పెద్దరికాన్ని ప్రస్తావిస్తూ తనకున్న గౌరవ భావాన్ని ప్రదర్శించారు. ఆయనను ఇంటికి వెళ్లి మరీ కలుస్తానని చెప్పిన పవన్.. ఆయన తనను అనే మాటలను పెద్దగా తీసుకోనని.. ఇంట్లో పెద్దోళ్ళు ఒక మాట అంటే భరించలేమా? అంటూ చెప్పడం విశేషం.కాపు కులం ఓట్లను టార్గెట్ చేసే క్రమంలో.. తానే కాపులకు పెద్దగా తనకు తాను ఊహించుకుంటున్నారు ముద్రగడ. ఈ క్రమంలో అదే సామాజిక వర్గంలో డ్యామేజ్ అవుతున్నారు. వైసిపిని డ్యామేజ్ చేస్తున్నారు.

అయితే పవన్ అలా హుందాగా ప్రవర్తించారో లేదో.. నీ ముగ్గురు భార్యలకు టిక్కెట్ ఇప్పిస్తానంటూ పవన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ముద్రగడ. అయితే ముద్రగడ చేస్తున్న వ్యాఖ్యలతో వైసిపి కి డ్యామేజ్ అవుతోందని.. కాపు ఓట్లు కూటమి వైపు టర్న్ అవుతున్నాయని కాపు పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడతో వైసీపీకి నష్టమని ఆ పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గం అభ్యర్థులు చెబుతున్నారు. మొత్తానికైతే జగన్ ఇచ్చిన టాస్క్ ను తప్పుతున్నారు ముద్రగడ. తిరిగి ఆ పార్టీకే అంతులేని నష్టాన్ని చేకూరుస్తున్నారు. జూన్ 4 తర్వాత కానీ ముద్రగడ వ్యాఖ్యలతో ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగిందో తెలియని పరిస్థితి. కనీసం ఈ రెండు రోజులపాటు అయినా ముద్రగడ నోటికి తాళం వేయాలని కాపు సామాజిక వర్గం అభ్యర్థులు కోరుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version