Mudragada And Harirama Jogaiah: ఎన్నికల అన్నాక వ్యూహాలు ఉంటాయి. ఇవి తెలియనివి కావు. కానీ గత ఎన్నికల్లోరకరకాల వ్యూహాలతో జగన్ అధికారంలోకి రాగలిగారు. అందులో ప్రధానమైనది కాపుల మద్దతు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. విధ్వంసాలకు దారితీసింది. అందుకే కాపులు తెలుగుదేశం ప్రభుత్వంపై ఆగ్రహంతో జగన్ కు మద్దతు తెలిపారు. ప్రత్యామ్నాయంగా జనసేన ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. అయితే దీనికి ప్రధాన కారణం కాపు నేతలే. నాడు కాపు నేతలుగా ఉన్న ముద్రగడ, హరి రామ జోగయ్య కనీస స్థాయిలో కూడా కాపులకు పిలుపునివ్వలేదు. ఇప్పుడు టిడిపి తో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని సదరు కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పవన్ గట్టి అస్త్రాలే సంధిస్తున్నారు. గత ఎన్నికల్లో మీరు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు.
వైసిపి ఆవిర్భావ సమయములో హరి రామ జోగయ్య వైసీపీ వెంట నడిచారు. ఆ పార్టీకి విలువైన సలహాలు సూచనలు అందించారు. జగన్ తో విభేదించి బయటకు వచ్చారు. అలాగని గత ఎన్నికల్లో జనసేనకు బాహటంగా మద్దతు తెలపలేదు. అటు ముద్రగడ పద్మనాభం సైతం ఒక్కనాడు కూడా జనసేనకు అనుకూల ప్రకటన చేయలేదు. కేవలం వైసీపీకి లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న అపవాదు ఆయనపై ఉంది. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉన్నఫలంగా విడిచిపెట్టారు. కాపు రిజర్వేషన్లను సైతం జగన్ ఎత్తివేసినా నోరు మెదపలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోగా.. తక్కువ సీట్లు అంటూ గగ్గోలు పెడుతున్నారు. పొత్తు విచ్చన్నానికి.. ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదని వైసీపీకి అనుకూలంగా కోవర్టు ఆపరేషన్ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే పవన్ సైతం మీ సలహాలు అక్కర్లేదంటూ తేల్చి చెప్పడంతో రకరకాల చర్చ ప్రారంభమైంది.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు జరగకుండా చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. ఒకవేళ జరిగినా సీట్ల సర్దుబాటు దగ్గర ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అంతా భావించారు. కానీ అటువంటి దానికి పవన్ అవకాశం ఇవ్వలేదు. ఈ తరుణంలోనే ఈ ఇద్దరు నేతల లేఖలు వెనుక వైసిపి ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. నిజానికి హరి రామ జోగయ్య వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కనీసం మంచం దిగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన పేరుతో వస్తున్న లేఖలు.. ఆయన రాస్తున్నారా? వైసిపి ఆఫీసు నుంచి వస్తున్నాయా? అన్నదానిపై స్పష్టత లేదు. చివరకు పవన్ పట్టించుకోకపోవడంతో హరి రామజోగయ్య కుమారుడు నేరుగా వైసీపీలో చేరారు.దీంతో హరి రామ జోగయ్య విషయంలో కొంత స్పష్టత వచ్చినట్టే.
ఇప్పుడు ముద్రగడ సైతం ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలోనే పవన్ విషయంలో ముద్రగడ చాలా సందర్భాల్లో నోరు జారారు. వారాహి యాత్ర సమయములో సవాళ్లు చేసి మరీ పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. పవన్ వ్యక్తిగతంగా దూషించిన ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీరును సమర్థించారు. తరువాత ఎందుకు వైసీపీకి దూరం జరిగారు. జనసేన, టిడిపిలో చేరతానని చెప్పుకొచ్చారు. కానీ ఆ రెండు పార్టీలు ఆయనను పట్టించుకోకపోవడంతో సీట్ల పంపకాల పేరుతో లేఖాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. కాపుల లెక్కల పేరుతోనే ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. అయితే ఇవన్నీ వర్కౌట్ కాకపోవడంతో ముసుగు తీసి వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి సాహసిస్తున్నారు. మొత్తానికి కాపు దిగ్గజ నేతలు ఇద్దరు వైసీపీకి అనుకూలంగా మారడం వ్యూహమా? వ్యూహాత్మకమా? అన్నది తెలియాల్సి ఉంది.