MP and MLA : రాయలసీమలో( Rayalaseema ) అనూహ్య ఫలితాలు సాధించింది టిడిపి కూటమి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతంగా ఉండే రాయలసీమలో ఆ పార్టీకి దారుణంగా దెబ్బతీసింది. కూటమి వేవ్ లో చాలామంది నేతలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాయలసీమలో ఈ స్థాయి విజయాన్ని చూసిన చంద్రబాబు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. చాలా రకాలుగా సూచనలు చేశారు. ఐకమత్యంతో ఉండి పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య విభేదాలు ఉన్నాయి. రోజురోజుకు అవి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నివురు గప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇలానే కొనసాగితే కష్టమని ప్రచారం జరుగుతోంది.
Also Read : 1952-2019 వరకూ ఏపీ ఎమ్మెల్యేలు, ఎంపీల చిట్టా
* టిడిపి కూటమికి మంచి గెలుపు..
కర్నూలు జిల్లాలో( Kurnool district) ఈసారి టిడిపి కూటమి సత్తా చాటింది. 2014, 2019 ఎన్నికల్లో ప్రభంజనం చాటిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తోక ముడిచింది. కొత్త కొత్త నేతలు ప్రజాప్రతినిధులుగా మారారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి అనూహ్యంగా కర్నూలు ఎంపీ అయ్యారు. అయితే ఆది నుంచి శబరి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు కొందరు ఎమ్మెల్యేలతో విభేదాలు తలెత్తాయి. కొన్ని సందర్భాల్లో బయటపడ్డాయి కూడా. ఆమె ఎమ్మెల్యేలను ఏమాత్రం లెక్క చేయడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలోని చాలామంది ఎమ్మెల్యేలతో ఆమెకు పడడం లేదు. రాజాగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయ సూర్యకు, ఎంపీ శబరి కి మధ్య ఉన్న వివాదాలు రోడ్డు ఎక్కాయి. ఏకంగా అధికారిక కార్యక్రమంలో ఈ విభేదాలు వెలుగు చూడడంతో జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
* నందికొట్కూరులో పట్టు..
బైరెడ్డి కుటుంబ( byreddy family) సొంత నియోజకవర్గం నందికొట్కూరు. ఆ నియోజకవర్గంలో పట్టు కోసం ఆ కుటుంబం పరితపిస్తుంది. అది రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఆ కుటుంబం పోటీ చేయడానికి వీలుపడడం లేదు. అయితే కర్నూలు నుంచి ఎంపీగా ఎన్నికైన శబరి ( Sabari )ఆ నియోజకవర్గంలో పట్టు బిగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దీనికి శంకుస్థాపన జరపాలని అధికారులకు మంత్రి అనిత ఆదేశించారు. దీంతో అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం కర్నూలు ఎంపీ, నందికొట్కూరు ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి ఎంపీ ని ఎందుకు పిలిచారు అంటూ ఎమ్మెల్యే జై సూర్య అధికారులను ప్రశ్నించారు. ముహూర్తానికి ముందే ఎంపీ రాకుండానే శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Also Read : ఏపీలో ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలపై కేంద్రం ఫోకస్..త్వరలో ఈడీ దాడులు?
* ముందుగానే ఎమ్మెల్యే శంకుస్థాపన..
ఎంపీ శబరి వచ్చేసరికి ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం తాను వచ్చేదాకా ఎందుకు ఆగలేదని అధికారులను ప్రశ్నించారు. వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే చేసిన శంకుస్థాపనకు పక్కనే మరో శంకుస్థాపన చేశారు శబరి. అయితే ఎమ్మెల్యే జయ సూర్య వెనుక టిడిపి శ్రేణులు అధికంగా ఉన్నారు. ఎంపీ శబరి వెనుక మాత్రం పరిమిత సంఖ్యలో మాత్రమే కనిపించారు. మొత్తానికి అయితే కర్నూలు జిల్లాలో టిడిపిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. మరి హై కమాండ్ ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగుతుందో చూడాలి.