MP Peddireddy Mithun Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ( MP Mithun Reddy) ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయన మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఐదు రోజులపాటు బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఆ గడువు ముగియడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి స్వచ్ఛందంగా సరెండర్ కానున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితునిగా ఉన్నారు. ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన పాత్ర పై స్పష్టమైన ఆధారాలు చూపింది. దీంతో బెయిల్ దక్కకుండా పోయింది. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు బెయిల్ పై విడుదలయ్యారు. కానీ మధ్యంతర బెయిల్ పై విడుదలైన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మాత్రం తిరిగి జైల్లోకి రావాల్సి వచ్చింది. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన లొంగిపోనున్నారు.
* పాత్ర పై ఆధారాలు..
మద్యం కుంభకోణంలో( liquor scam ) ఎంపీ మిధున్ రెడ్డి పాత్ర ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు నమోదు చేసింది. ఆయనపై లోతైన విచారణను కొనసాగించింది. మద్యం సరఫరా చేసే డిస్టర్లరీలు, మద్యం తయారు చేసే సంస్థలను స్వాధీనం చేసుకుని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారు అన్నది అభియోగం. ఇందులో అంతిమ లబ్ధిదారుడు తర్వాత ఎక్కువగా లబ్ధి పొందింది పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జిషీట్లో స్పష్టం చేసింది. నెలకు 5 కోట్ల రూపాయల వరకు కమీషన్ల రూపంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొల్లగొట్టారని పేర్కొంది. అందుకు సంబంధించి ఆధారాలను సైతం సిట్ చూపించగలిగింది. అందుకే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి బెయిల్ లభించడం లేదు. గత 47 రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ వచ్చారు.
* ఉపరాష్ట్రపతి ఎన్నికలకు గాను..
ఉపరాష్ట్రపతి ( Indian vice president)ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పార్టీ ఎంపీలను సమన్వయం చేసుకునేందుకుగాను తనకు అవకాశం ఇవ్వాలని.. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిధున్ రెడ్డి. దీంతో కోర్టు ఐదు రోజుల కిందట షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దాని గడువు ఈరోజుతో ముగియడంతో మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. అదే సమయంలో ఆయన రెగ్యులర్ బెయిల్ పై కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఎటువంటి ఆధారాలు చూపలేదని చెబుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు బెయిల్ ఇచ్చింది కోర్టు. అలాగే తమకు బెయిల్ లభిస్తుందని పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు విషయంలో మాత్రం పక్కా ఆధారాలతో సిట్ చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.