
బెంగుళూరు-చెన్నై జాతీయ రహదారిలో దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. అచ్చం సినిమాల్లో చూపించే విధంగా నైపుణ్యంగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. మనం సినిమాల్లో చూసినప్పుడు వినోదం కలిగించే విధంగా ఉండే సన్నివేషాలు నిజ జీవితంలో కూడా కనిపించడంతో బాధితులు కంగారు పడిపోతున్నారు. ఎప్పుడు ఏ దొంగతనం జరుగుతుందో అని బెంబేలెత్తిపోతున్నారు. దొంగలు తమ పద్దతులు మార్చుకుంటూ వినూత్నంగా చోరీలు చేస్తున్నారు. రూ. కోట్ల విలువ చేసే కంటైనర్ లను లక్ష్యంగా చేసుకుని అందులో ఉన్న వస్తువులను తస్కరిస్తున్నారు.
ఒక స్టేట్ నుంచి మరో స్టేట్ కు పెద్ద పెద్ద కంటైనర్లలో మొబైల్ ఫోన్లు, టీవీలు, కార్లు తదితర విలువైన వస్తువులను సరఫరా చేస్తుంటారు. అయితే దొంగలు కూడా ఇన్నాళ్లు ఇళ్లను టార్గెట్ చేసే వారు. కానీ ప్రస్తుతం దొంగలు రూటు మార్చారు. హైవేలపై వెళ్లే కంటైనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందులోని సరుకులను పూర్తిగా దోస్తున్నారు. నాలుగుసార్లు రెక్కీ నిర్వహించి సమయం చూసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు.
258 కిలోమీటర్లు ఉండే హైవేపై చాలాసులువుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగల ముఠా సభ్యులు రెండు మూడు సార్లు రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలించి తమ వ్యూహాన్ని ఖరారు చేసుకుంటారు. వరుసగా దొంగతనాలు చేస్తే పట్టుబడతామని భావించి మధ్యలో విరామం ఇష్తున్నారు. దీంతో పోలీసులకు కూడా సవాలుగానే మారుతోంది. ఎప్పుడు ఎక్కడ చోరీ జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
మొన్న నగరి సమీపంలో దొంగతనం జరగగా నిన్న తమిళనాడు సమీపంలోని కృష్ణగిరి వద్ద కంటైనర్ లోని దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే ఎలక్రానిక్ వస్తువులను చోరీ చేశారు. తాజాగా రూ.6.50 కోట్ల విలువ చేసే ఎంఐ ఫోన్లను కంటైనర్ నుంచి దోచుకెళ్లారు. గుర్తు తెలియని దుండగులు కంటైనర్ వెంట పడ్డారు. కర్ణాటక ఆంధ్ర బార్డర్ లోని పలమనేరు సమీపంలోని నెంగలి చెక్ పోస్టు దాటిన తరువాత ఎవరు రారు అనుకున్న ప్రదేశంలో రన్నింగ్ కంటైనర్ పైకి ఒకరు ఎక్కగా మరో ఇద్దరు కంటైనర్ ముందుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేశారు. దీంతో డ్రైవర్ కంటైనర్ ను ఆపాడు. దీంతో కంటైనర్ ను అటవీ ప్రదేశంలోకి తీసుకెళ్లి డ్రైవర్ ను కట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నార. దొంగలను త్వరలో పట్టుకుంటామని కోలార్ ఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. ఆ:ధ్ర, తమిళనాడులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో రెండు స్టేట్ల పోలీసుల సహకారంతో నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. దొంగతనాలపై ప్రజల్లో కూడా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.