Modi Support To Lokesh: ఏపీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) వ్యూహం మారిందా? ఆయన భవిష్యత్ రాజకీయంపై దృష్టి పెట్టారా? చంద్రబాబు వారసుడ్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల పరిధిలో మూడు లక్షల మందితో సామూహిక యోగాసనాలు వేసి రికార్డు సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఇదే వేదికపై ప్రసంగించిన ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు అభినందించారు. అంతకుమించి మంత్రి నారా లోకేష్ విషయంలో అభినందిస్తూ ప్రత్యేక ప్రస్తావన తీసుకురావడం పొలిటికల్ సర్కిల్ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
టిడిపి పై భిన్నాభిప్రాయం..
గతంలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ అంటే ప్రధాని నరేంద్ర మోడీ అంటి ముట్టనట్టుగా ఉండేవారు. అయితే ఈసారి మాత్రం అలా కాదు. ఆ పార్టీకి దగ్గర అయినట్లు స్పష్టంగా కనిపించారు. ఆయన ప్రసంగం సైతం తెలుగుదేశం పార్టీ చుట్టు తిరిగింది. ముఖ్యంగా పార్టీలో యువ నేత నారా లోకేష్ ని ప్రశంసించడం.. ఆకాశానికి ఎత్తేయడం టాక్ ఆఫ్ ది డే గా మారింది. చంద్రబాబుతో పాటు పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు మోడీ. కానీ ఆ ఇద్దరినీ మెచ్చుకోలేదు. కానీ లోకేష్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రశంసల జల్లు కురిపించారు. యోగాంధ్ర కార్యక్రమం నారా లోకేష్ మాత్రమే చేసినట్లు.. ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ కే చెందుతుంది అన్నట్టు ప్రధాని మోదీ ప్రసంగం సాగింది. ఇదే ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
Also Read: PM Modi Vizag Yoga Day: ఏపీకి ప్రధాని మోదీ.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
లోకేష్ పై ప్రశంసలు..
సీఎం చంద్రబాబు( CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం విశాఖలో యోగా దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేసిందని మోడీ అభినందించారు. అలా మాట్లాడుతునే నారా లోకేష్ ప్రస్తావన తెచ్చారు. ఇంతమంది యువతను ఇంత తక్కువ సమయంలో ఒకే తాటిపైకి తీసుకురావడం వెనుక లోకేష్ కృషి ఉందని అన్నారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ కామెంట్స్ పై చర్చ నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించి.. లోకేష్ కు టాప్ ప్రయారిటీ ఇచ్చారని విశ్లేషణలు మొదలయ్యాయి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసినప్పుడు కూడా మోదీ లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. భుజం తట్టి మరి ఢిల్లీ వచ్చి తనను కలవాలని ఆహ్వానించారు. అక్కడకు కొద్ది రోజులకే లోకేష్ ఢిల్లీ వెళ్లారు. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. లోకేష్ భార్యతో పాటు కుమారుడు సైతం హాజరయ్యారు. వారిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా దీవించారు.
పవన్ చొరవతో పొత్తు
వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రధాని మోదీ ఎంత మాత్రం ఆసక్తిగా లేరని ప్రచారం నడిచింది. పవన్ కళ్యాణ్( Pawan Kalyan) చొరవతోనే టిడిపి తో బిజెపి జతకట్టిందన్నది ఒక వాదన. ఒకానొక సమయంలో టిడిపి మేనిఫెస్టో ప్రకటిస్తే.. తమకు సంబంధం లేదన్నట్టు బిజెపి వ్యవహరించింది. ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ కు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు నరేంద్ర మోడీ. కానీ ఇప్పుడు ఎందుకో సీన్ రివర్స్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. ఈరోజు యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా పట్టించుకోలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పలకరించింది కూడా లేదని తెలుస్తోంది. అయితే లోకేష్ ను మెచ్చుకోవడం ద్వారా.. ఒక్క చర్చకు తెర తీశారు ప్రధాని మోదీ. జనసేనను పక్కన పెట్టబోతున్నారని.. వచ్చే ఎన్నికల్లో టిడిపి తో మాత్రమే జత కడతారని టాక్ ప్రారంభమైంది. చూడాలి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో?