TDP Janasena BJP Alliance: ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్.. కీలక ప్రకటన

2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ తో పాటు చంద్రబాబు, పవన్ లు ఒకే వేదికపై కనిపించారు. నాటి ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన బయట నుంచి మద్దతు ప్రకటించింది.

Written By: Dharma, Updated On : March 12, 2024 12:49 pm

TDP Janasena BJP Alliance

Follow us on

TDP Janasena BJP Alliance: ఏపీలో పొత్తులు లెక్కలు తేలాయి. టిడిపి, జనసేన, బిజెపి మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారన్న దానిపై కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీలు సంయుక్తంగా అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఇదే స్పీడుతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే సిద్ధం పేరిట ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలను పూర్తి చేశారు. భారీ జన సమీకరణ చేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ఇప్పుడు పొత్తులతో ఆ మూడు పార్టీల్లో జోష్ నెలకొన్న వేళ భారీ ఎన్నికల ప్రచార సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. చంద్రబాబు, పవన్ లతో మోడీ వేదిక పంచుకోనున్నారు. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లలో మూడు పార్టీలు దృష్టి పెట్టాయి.

2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ తో పాటు చంద్రబాబు, పవన్ లు ఒకే వేదికపై కనిపించారు. నాటి ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన బయట నుంచి మద్దతు ప్రకటించింది. అప్పట్లో ఎన్నికల ప్రచార సభల్లో పవన్ సైతం పాల్గొన్నారు. అయితే నాడు నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా, చంద్రబాబు ఏపీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. దీంతో ఈ సభకు భారీగా జన సమీకరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా సిద్ధం సభలకు దీటైన జవాబు ఇవ్వాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని ప్రకటనలు చేస్తారని.. కొన్ని విభజన హామీలను నెరవేర్చేలా మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రధాని సభను విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.జనసేన, బిజెపి శ్రేణులతో కలిపి 13 కమిటీలను నియమించింది. వీటి సమన్వయ బాధ్యతలను నారా లోకేష్ చూస్తున్నారు. ఈ కమిటీలతో మంగళవారం చంద్రబాబు సమావేశమయ్యారు. అదే సమయంలో ప్రధాని మోదీ ఏపీ పర్యటనను కార్యాలయం ఖరారు చేసింది. చిలకలూరిపేట సమీపంలోనే బొప్పూడిలో సభా వేదికను ఏర్పాటు చేశారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి మూడు పార్టీల నుంచి 115 మంది నేతలతో 12 ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేశారు. ఇదే సభలో మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.