Regam Matsya Lingam: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. మొన్ననే ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరారు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వీరంతా వైసీపీకి షాక్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఓ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సైతం పార్టీ మారుతారన్న ప్రచారం సాగుతోంది. ఆయన వ్యవహార శైలి సొంత పార్టీలోనే హార్ట్ టాపిక్ అవుతోంది. గతంలో ఇదే తరహా ప్రచారం వచ్చింది కానీ.. ఆయన ఖండిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం ఆయన పరిస్థితి అనుమానంగా ఉన్నట్లు సొంత పార్టీ వారే చెబుతున్నారు.
Also Read: కిలాడి లేడి.. బడా బాబులే టార్గెట్.. రెండేళ్లలో 600 కోట్లు..
* ఇద్దరే ఇద్దరు..
ఉత్తరాంధ్రలో( North Andhra) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు స్థానాల్లోనే. అది కూడా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలైన అరకు, పాడేరు నుంచి మాత్రమే గెలిచారు. అయితే వైసిపి నుంచి గెలిచిన ఆ ఇద్దరిపై అనేక రకాల ప్రచారం నడిచింది. కానీ వారిద్దరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. నిన్ననే రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలపై ఆందోళన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపు ఇచ్చింది. ఎక్కడెక్కడ అయితే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారో.. అక్కడకు వెళ్లి నిరసన చేపట్టాలని అన్ని జిల్లాల నాయకులకు సమాచారం ఇచ్చింది హై కమాండ్. ఎక్కడికక్కడే ఉమ్మడి జిల్లాల నాయకులు వెళ్లి నిరసన తెలిపారు. కానీ పాడేరు లో జరిగిన ఆందోళనకు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం దూరంగా ఉన్నారు. విశాఖ తో పాటు అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. కానీ పక్కనే ఉన్న అరకు ఎమ్మెల్యే హాజరు కాకపోవడం పై రకరకాల ప్రచారం ప్రారంభమైంది. ఆయన వేరే ఆలోచనతో ఉన్నట్లు సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది.
* కూటమి ప్రభంజనంలో సైతం..
కూటమి( Alliance ) ప్రభంజనంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మత్స్యలింగం గెలిచారు. అరకులో టిడిపి 2009లో చివరిసారిగా గెలిచింది. అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచిన సివేరి సోమ నక్సల్స్ దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అటు తరువాత మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. మొన్నటి ఎన్నికల్లో కూడా టిడిపి ఓడిపోయింది. అయితే ఇక్కడి నుంచి గెలిచిన మత్స్య లింగం టిడిపిలో చేరుతారని ప్రచారం నడిచింది. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ బలపడేందుకు టిడిపి ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం గండిపడుతూ వచ్చింది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలవాలని టిడిపి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మత్స్య లింగం టిడిపి హై కమాండ్ టచ్ లోకి వెళ్లారని.. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమానికి దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది. మత్స్యలింగం ఆ నిర్ణయానికి వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ తప్పదు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.