Kolikapudi vs Chinni: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో ఇటీవల విభేదాలు వీధిన పడుతున్నాయి. వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది నాయకత్వం. నిన్ననే టిడిపి క్రమశిక్షణ కమిటీ ఎదుటకు వచ్చారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. కొద్ది రోజుల కిందట ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. వేర్వేరుగా హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇది జరిగిన తరువాత కూడా ఓ పరిణామం టిడిపి నాయకత్వానికి షాక్ ఇచ్చింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ కార్యక్రమంలో ఎంపీ కేసినేని చిన్నిని విస్మరించడం వివాదం కొనసాగుతుందే తప్ప.. ఫుల్ స్టాప్ పడలేదని అర్థం అవుతుంది.
ఇద్దరూ ఒకేసారి..
విజయవాడ ( Vijayawada)ఎంపీగా గెలిచారు కేసినేని చిన్ని. అదే సమయంలో తిరువూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కొలికపుడి శ్రీనివాసరావు. టిడిపిలో నెలకొన్న పరిణామాలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు కేసినేని నాని. ఆయనకు ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు చిన్నిని ప్రోత్సహించింది టిడిపి నాయకత్వం. నాని వైసీపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. చిన్ని టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలోని తిరువూరు టిక్కెట్ను కొలికపూడి శ్రీనివాసరావుకు ఇవ్వాలని సిఫారసు చేశారు. ఇద్దరూ గెలిచారు. కానీ తరచూ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు వివాదాస్పదంగా మారారు. సొంత పార్టీ శ్రేణులు సైతం ఆయనను వ్యతిరేకిస్తూ హై కమాండ్కు ఫిర్యాదు చేశాయి. ఈ తరుణంలో తిరువూరు సమన్వయ బాధ్యతలను కేసినేని చిన్నికి అప్పగించింది టిడిపి నాయకత్వం. అయితే తనను విస్మరించి మాజీమంత్రి జవహర్ ను తెరపైకి తెచ్చారని చిన్ని పై అనుమానం పెంచుకున్నారు శ్రీనివాసరావు. అప్పటినుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కేవలం అక్కడ సమన్వయ బాధ్యతలను అప్పగిస్తే.. మరింత జఠీలం చేశారని ఎంపీ చిన్ని పై టిడిపి నాయకత్వం ఆగ్రహంగా ఉంది.
కనిపించని ఎంపీ ఫోటో..
కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ టికెట్ కోసం ఎంపీ చిన్ని తన వద్ద ఐదు కోట్లు డిమాండ్ చేశారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అది మొదలు రచ్చ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరూ టిడిపి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. కొలికపూడికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని ప్రచారం నడిచింది. అయితే క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన శ్రీనివాసరావు చంద్రబాబు పట్ల గౌరవ భావాన్ని ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వివాదం ముగిసిందని అంతా భావించారు. కానీ లోకేష్ ఆదేశాల మేరకు ప్రజాదర్బార్ నిర్వహించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించకపోవడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. కానీ అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ కేశినేని చిన్ని ఫోటో లేదు. దీంతో ఎంపీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కొలికపూడి సంకేతాలు ఇచ్చినట్లు అయింది.