Minors love story: టీనేజ్ లో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. మరెన్నో ఉద్వేగాలు ఉంటాయి. వాటిని ప్రేమ అనుకుంటే తప్పు. ఆ వయసు వేడిలో చేసే తప్పు జీవితాంతం వెంటాడుతుంది. అటువంటి తప్పే ఈ బాల బాలికలు చేయబోయారు.. చివరికి దొరికిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ లంక ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా వీరిద్దరికి పరిచయం ఉంది. బుధవారం ఆ బాలుడి పుట్టినరోజు కావడంతో పాఠశాలకు వెళ్లలేదు. ఆ బాలిక స్కూల్ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పింది. స్కూలుకు వెళ్లకుండా నేరుగా బాలుడు ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఆ బాలుడి తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఈ క్రమంలో వారిద్దరు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆ బాలుడు ఆ బాలికను ఇంట్లోనే ఉంచాడు. నేరుగా పాఠశాలకు వెళ్లి అందరికీ చాక్లెట్లు పంచిపెట్టాడు. అనంతరం ఆ బాలిక తన ఇంటికి వెళ్లిపోయింది. మధ్యాహ్నం లంచ్ చేసి పాఠశాలకు అని చెప్పి నేరుగా బాలుడింటికి వెళ్ళింది.
ఆ బాలుడు ఇంట్లో నుంచి పదివేలు తీసుకొని.. బాలికతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. స్కూల్ క్లోజింగ్ టైం ముగిసినప్పటికీ బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాఠశాల వద్ద ఎంక్వయిరీ చేశారు. అసలు ఈ రోజు మీ కుమార్తె పాఠశాలకు రాలేదని చెప్పడంతో వారు ఒక్కసారిగా ఆందోళన చెందారు. స్నేహితుల వద్ద ఎంక్వయిరీ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే స్కూల్ యూనిఫాంలో ఓ బాలుడి తో కలిసి ఆ బాలిక వెళ్ళిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాలుడు వద్ద ఉన్న ఫోన్ మీద పోలీసులు ఎంక్వయిరీ పెట్టారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వారి అడ్రస్ కనుక్కోవడం పోలీసులకు కాస్త ఇబ్బందికరంగా మారింది.
కొద్దిసేపటికి ఫోన్ ఆన్ కావడంతో పోలీసులకు లొకేషన్ ఎక్కడ ఉందో తెలిసింది. వారిద్దరూ హైదరాబాదులో దిగినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో దిగిన ఆ ఇద్దర మైనర్లు వనస్థలిపురం వెళ్లారు. అక్కడి నుంచి తుక్కుగూడ ప్రాంతానికి చేరుకున్నారు. ఇల్లు రెంటుకు కావాలని పరిసర ప్రాంతాలలో తిరిగారు. ఓ ఆటో డ్రైవర్ వారిద్దరిని గమనించి తన ఇంటికి తీసుకెళ్లాడు. వివరాలు కనుకున్నాడు. వారిద్దరి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అదే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత వారిద్దరిని అదుపులోకి తీసుకొని విజయవాడ వెళ్లిపోయారు. వారిద్దరికీ ప్రస్తుతం పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.