Caste Meetings : కులం..ఇది వినడానికి శ్రావ్యంగా వినిపించేమాట. మేము,మనం, మావాడు అన్న ఫీలింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. మనసుకు హాయి నింపుతుంది. సమాజంలో ఆర్థిక అసమానతల గణాంకాల కోసం పుట్టుకొచ్చిందే కులం. ఐక్యత కోసం శతాబ్దాల కిందట గీసిన విభజన రేఖే కులం. కానీ ఈ కులం మనిషిలో భాగమైంది. సమాజంలో అంతర్భాగమైంది. కానీ ఇందులో ‘రాజకీయం’ ప్రవేశించాక..కులం అన్న మాట కలుషితమైంది. ఐక్యత అన్నది దెబ్బతిన్నది. కులాల మధ్య చిచ్చుకు కారణమైంది. కులం ఐక్యత తప్పనిసరి. అది ఎంతలా అంటే ఎదుటి కులాన్ని గౌరవిస్తూనే మన కుల ప్రయోజనాల కోసం పోరాడే విధంగా ఉండాలి. ఎదుటి కులాల హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలి. వారు తమ సోదర కులం అన్న భావన ఉండాలి. అయితే విశాల భారతదేశం వేల కులాలను తనలో ఇముడ్చుకుంది. తనలో అంతర్భాగంగా ఉంచుకుంది. అందుకే దేశ ఔన్నత్యాన్ని కాపాడాలంటే అన్నికులాలు సమానమేనన్న భావన రావాలి.
ఉమ్మడి రాష్ట్రంలో అయినా, విభజిత రాష్ట్రంలో అయినా కమ్మలది ప్రత్యేక స్థానం. సంఖ్యా బలంగా తక్కువగా ఉన్నా.. రాజ్యాధికారం దక్కించుకోవడంలో మాత్రం ఆ సామాజిక వర్గం సక్సెస్ అయ్యింది. అందుకు ఆ సామాజిక వర్గంలో ఉన్న ఐక్యతే కారణం. స్వతంత్రం రాకమునుపే.. అఖిల భారత కమ్మ సంఘం పేరిట మహాసభలు నిర్వహించిన చరిత్ర వారిది. అయితే తమ సామాజిక వర్గం ఐక్యత వరకు పరవాలేకున్నా.. ఇతర కులాలను తొక్కి పెట్టారన్న అపవాదును మూటగట్టుకున్నారు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు సీఎం అయ్యారు. సింహభాగం రాజకీయ ప్రయోజనాలు ఆ సామాజిక వర్గానికి దక్కాయి అనడం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 20, 21న ప్రపంచ కమ్మ మహాసభ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉభయ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు హాజరు కానున్నారు. తాము పదవిలో ఉండగా ఇటువంటి పక్షపాతం, రాగద్వేషాలు చూపించమని ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు కుల సంఘాల సమావేశానికి హాజరు కావడం ఇదే తొలిసారి కాదు. కులాల్లో ఉన్న వెనుకబడిన వర్గాల అభివృద్ధి కంటే.. కులాల పేరిట రాజకీయ, ఇతరత్రా రంగాల్లో ఆధిపత్యం కోసం కుల సమావేశాలు పెట్టుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది.
* సంప్రదాయం కొనసాగాలి
ఎదుటి కులాలను సైతం గౌరవించే సంప్రదాయం కొనసాగాలి. అగ్రవర్ణాలుగా పేరొందిన బ్రాహ్మణుల్లో నిరుపేదలే అధికం. వెనుకబడిన వర్గాల్లో ఆర్థిక స్థితిమంతులు కూడా ఉన్నారు. కులం అన్నది సమాజంలో ఒక గుర్తింపు కోసం. ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి శతాబ్దాల కిందట ఏర్పాటుచేసిన కొలమానమే తప్ప.. మనిషికి మనిషికి విభజన రేఖ కాదన్న విషయం గ్రహించుకోవాలి.‘మానవా ఏమున్నది ఈ దేహంలో’ అంటూ ఓ సినీ కవి రాసింది అక్షర సత్యం. అందులో నిగూడార్ధం కూడా దాగి ఉంది. కులం, మతం, ప్రాంతం, ధనికుడు, పేద అన్నదాంట్లో తారతమ్యం ఉండదు. ఈ దేహం ఉన్నంత వరకేనని ఆ సినీ కవి గొప్పగా వర్ణించాడు. అయితే ఇంతకు మించి చెప్పినా వ్యర్థమాటలు అని ఎక్కువ మంది భావిస్తారు. అయితే ఇటివల కుల ఐక్యత ఫరిడవిల్లడం చాలా సంతోషించదగ్గ విషయం. అందరూ ఒకేచోట కలిసి వేడుకలు జరపుకోవడం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు తమలో తామే ప్రయత్నించడం శుభ పరిణామం.
* విద్యను ప్రోత్సహించాలి
ఏడాదికి ఒకసారి కుల ఐక్యవేదిక సమావేశాలు పెట్టుకోవడం అనేది ఆహ్వానించదగ్గదే. ఏ కులంలోనైనా విద్య వికసిస్తేనే దాని ఫలాలు దక్కుతయన్న విషయాన్ని గ్రహించాలి. అందుకే ముందుగా విద్యాపరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, సామాజిక ప్రోత్సాహం కూడా అనివార్యమనే చెప్పుకోవాలి. చదువుకోవాలన్న ఆకాంక్ష ఉన్నా.. చదవడానికి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న చాలామంది మధ్యలో చదువు నిలిపివేస్తుంటారు. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలు వెళుతుంటారు. అటువంటి వారిని గుర్తించి చేయూతనందించాల్సిన అవసరం కుల సంఘాల ప్రతినిధులపై ఉంది. తమ కులం మధ్య అంతరాలు పెరిగినప్పుడు వాటిని నియంత్రించాల్సిన అవసరం కూడా కులసంఘాలపైనే ఉంది.
* నేతల్లో కూడా ఆ భావన ఉండాలి
కులాలకు రాజకీయ అవకాశాలు దక్కాలనుకోవడంలో తప్పులేదు. కానీ తమ కులం నుంచి ప్రాతినిధ్యం వహించే నేతలకు ఆ భావన ఉందా? లేదా? అన్న విషయం గ్రహించుకోవాలి. ఎన్నుకునే వరకు కులం పేరు చెప్పుకునేవారుంటారు. తరువాత మరిచిపోయినవారంటారు. కుల నాయకుడిగా ఎదిగి.. ప్రజాప్రతినిధిగా స్వరం మార్చిన వారుంటారు. అయితే సమాజంలో మన కులంతో పాటు ఇతర కులాల వారుంటారు. అందరికీ సమభావంతో చూసుకోవడం ప్రజాప్రతినిధి ప్రథమ కర్తవ్యం. కానీ కులంలో వెనుకబడిన వారిని గుర్తించి చేయూతనందించాల్సిన అవసరం కూడా అంతే కర్తవ్యంగా భావించాలి. అయితే తమ కులానికి చెందిన నాయకుడు తమనే ఉద్ధరించాలన్నది కూడా కరెక్టు కాదు. ఆయన అందరికీ ప్రజాప్రతినిధి అన్న విషయం గుర్తెరగాలి. సో కులాల మధ్య ఐక్యత ఉంటూనే.. తమకు తాము ప్రోత్సహించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. అప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. అన్నికులాల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ministers chief ministers revanth and chandrababu attending caste meetings is the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com