Minister Satyakumar Yadav : ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మరోవైపు వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇంకోవైపు పార్టీ నేతలపై దాడులు, కేసులు కొనసాగుతున్నాయి. లడ్డు వివాదం, ప్రకాశం బ్యారేజీకి బోట్లు వదలడం వంటి వాటితో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.ఇటువంటి తరుణంలో జగన్ కు షాక్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. వైయస్సార్ జిల్లా పేరును మార్చడానికి రంగం సిద్ధమవుతోంది. కడప జిల్లాకు చెందిన మంత్రి సత్య కుమార్ సీఎం చంద్రబాబు ఎదుట కీలక ప్రతిపాదనలు తెచ్చారు. వైయస్సార్ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలని ప్రత్యేక లేఖ రాశారు. ఈ లేఖలో కొన్ని అంశాలను పొందుపరిచారు. జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరడానికి తొలి గడప కడప. కడపకు ప్రత్యేక నేపథ్యం ఉంది. ఆధ్యాత్మిక ఆనవాళ్లు ఉన్నాయి. అటువంటి కడప పేరును కనీస అవగాహన లేకుండా గత సర్కారు మార్చేసింది. కడప జిల్లాకు వైయస్సార్ జిల్లా గా పేరు మార్చడమే తప్పు. అందుకే ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తిరిగి కడప జిల్లాగా పేరు మార్చాలని మంత్రి సత్య కుమార్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పేరును గెజిట్లో మార్పులు చేసి గతంలో జరిగిన తప్పును సరిదిద్దాలని కోరారు మంత్రి.
* కడప జిల్లా అభివృద్ధికి కృషి
అయితే రాష్ట్రానికి ఆరేళ్లపాటు సీఎంగా వ్యవహరించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆరేళ్ల కాలంలో కడప జిల్లా అభివృద్ధి చెందింది. అందుకే ఆ జిల్లాకు వైసిపి ప్రభుత్వం వైయస్సార్ జిల్లాగా పేరు మార్చింది. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక ఆనవాళ్లు పోకుండా కడప అనే పేరు ఉండాలని మంత్రి సత్య కుమార్ కోరుతున్నారు. వైయస్సార్ పేరు ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ వైయస్సార్ కడప జిల్లాగా పేరు మార్చాలని మాత్రమే కోరుకుంటున్నట్లు ఆ లేఖలు ప్రస్తావించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. అయితే మంత్రి తీరును తప్పు పడుతోంది వైసిపి. కడప జిల్లాను వైయస్సార్ జిల్లాగా మార్చింది తాము కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
* గౌరవార్థంగా పేరు
2004 నుంచి 2010 వరకు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా రాజశేఖర్ రెడ్డి వ్యవహరించారు. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇంతలో హెలిక్యాప్టర్ ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. అయితే అప్పట్లో ఆయన గౌరవార్థం సొంత జిల్లా కడపకు ఆయన పేరు పెట్టాలని భావించారు. అయితే కడప చరిత్రను పరిగణలోకి తీసుకోకుండా వైయస్సార్ జిల్లా గా మార్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైయస్సార్ జిల్లాకు పాత కడప గానే పరిగణించాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైయస్సార్ కడపగా మార్చుతారని తెలుస్తోంది.