Minister Narayana: వైసీపీ నేతలకు మంత్రి నారాయణ( Minister Narayana) అండగా నిలుస్తున్నారా? అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్నారా? వారికి క్లీన్ చీట్ ఇస్తున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. టిడిపి మీడియా గా భావించే ఆంధ్రజ్యోతిలో మంత్రి నారాయణ కు వ్యతిరేకంగా కథనం రావడం విశేషం. అంతటా దీనిపైనే చర్చ నడుస్తోంది. మంత్రి నారాయణ ఉదాసీన వైఖరి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి క్లీన్ చీట్ ఇచ్చారని.. వైసిపి హయాంలో పురపాలక శాఖలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆంధ్రజ్యోతిలో కథనం రావడం కూటమి వర్గాల్లో సంచలనంగా మారింది. మౌనమేల నారాయణ అంటూ వచ్చిన కథనం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఏకంగా అనుకూల మీడియాలో ఈ కథనం రావడంతో టీడీపీ శ్రేణులు కూడా ఆరా తీయడం ప్రారంభిస్తున్నాయి.
* భారీగా అవినీతి ఆరోపణలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో టిడిఆర్ బాండ్లు, అమృత్ 2.0 కింద చేపట్టిన పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. 2014 రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ క్యాడర్లో ఉండిపోయారు. తనకోసం జైలుకు వెళ్లిన ఆమెను ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆమెను కీలక పోస్టుల్లో నియమించారు. ముఖ్యంగా పురపాలక శాఖ బాధ్యతలను అప్పగించారు. కానీ టిడిఆర్ బాండ్లు, అమృత్ 2.0, పట్టణాల సుందరీకరణ పనుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారని సాక్షాత్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అవినీతి జరిగినట్లు ఆయన ఒప్పుకున్నట్లు అయ్యింది.
* సభా సంఘానికి ససేమీరా
ప్రస్తుతం శాసనసభ సమావేశాలు( assembly sessions ) జరుగుతున్నాయి. విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి, జనసేన, బిజెపి ఎమ్మెల్యేలు ఎక్కువగా టిడిఆర్ బాండ్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. పట్టణాల సుందరీ కరణ పేరుతో భారీగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇదే విషయం పై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తన నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను ప్రశ్నించారు. మంత్రితో పాటు సంబంధిత అధికారులు వస్తే అక్కడ జరిగిన అవినీతిని చూపిస్తానని చెప్పుకొచ్చారు. పిడిఆర్ బాండ్ల అవినీతిపై విచారణకు సభా సంఘాన్ని వేయాలని కోరారు. అందుకు పురపాలక శాఖ మంత్రి నారాయణ అంగీకరించలేదు. పైగా ఎటువంటి అవకతవకలు జరగలేదన్నట్టు ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనినే ప్రముఖంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. టిడిపి అనుకూల మీడియాలో ఇప్పుడు ఆ కథనం రావడంతో అంతటా అదే చర్చ కొనసాగుతోంది.
* బొకే తీసుకునేందుకు ఇష్టపడని చంద్రబాబు
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) కేసులో నిందితురాలిగా ఉన్నారు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. తనకోసం జైలుకు వెళ్లిన ఆమెను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తెప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆమెకు కీలక స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఆమె నిర్వర్తించిన శాఖలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందుకే చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఏఎస్ అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో శ్రీలక్ష్మి బొకే ఇవ్వగా అందుకునేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. కానీ శ్రీలక్ష్మి పలుమార్లు మంత్రి నారాయణ ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే మంత్రి నారాయణను వైసిపి ప్రభుత్వం టార్గెట్ చేసింది. అమరావతి రాజధానిలో నారాయణ కుటుంబ సభ్యులు అక్రమంగా భూములు కొన్న అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కానీ అవన్నీ మరిచిపోయి మంత్రి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సహకరిస్తున్నారని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. మరి దీనిపై మంత్రి నారాయణ ఎలా స్పందిస్తారో చూడాలి.