Viral News : బాల్యం ఒక వరం.. ఆ సమయం పోతే మళ్లీ తిరిగి రాదు. బాధలు, బాధ్యతలు లేకుండా సాఫీగా గడపాల్సిన సమయం. అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్ని అందరూ చాలా ఇష్టపడతారు. అయితే, ప్రతి ఒక్కరికీ అందమైన బాల్యం ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. విధి వెక్కిరించినా, తల్లిదండ్రుల తప్పిదాలైనా.. కారణమేదైనా.. ఆనందంగా ఉండాల్సిన బాల్యం కష్టతరంగా మారుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఏకంగా స్పందించారు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన పిల్లాడు వీధుల్లో అడుక్కుంటున్నాడు. బలపం పట్టాల్సినటువంటి ఆ చేయి రూపాయి కోసం వేడుకుంటుండడం చూసి హృదయం ద్రవించింది. ఒంటి నిండా రంగులతో రోడ్డు పక్కన అడుక్కుంటూ దయనీయ స్థితిలో కనిపించడం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సంతోష్ కుమార్ అనే సోషల్ మీడియా కార్యకర్త ఈ వీడియోను ట్యాగ్ చేసి మంత్రి లోకేష్ స్పందించాలని కోరారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. బాలుడిని తక్షణమే కాపాడుతామని, చిన్నారి దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
‘ఇది హృదయ విదారక సంఘటన. ప్రతి బిడ్డకు సమాజంలో భద్రత, ప్రేమ, గౌరవం అవసరం. మేము బిడ్డను గుర్తించి, అవసరమైన రక్షణ, సంరక్షణ చర్యలు తీసుకుంటాము. చిన్నారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. మంత్రి లోకేష్ స్పందించడం సంతోషకరమని సోషల్ మీడియా కార్యకర్త సంతోష్ కుమార్ అన్నారు. మంత్రి లోకేష్‌కు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా శిశు సంక్షేమం, జిల్లా శిశు సంక్షేమ శాఖల అధికారులకు మంత్రి లోకేష్ సూచనలు చేశారు. వెంటనే చిన్నారి కోసం జిల్లా శిశు సంక్షేమ అధికారి శారద నేతృత్వంలో నగరంలో సోదాలు నిర్వహించారు. మంత్రి లోకేష్ స్పందించిన వీడియోలోని చిన్నారి కర్ణాటకకు చెందినదని స్థానిక యాచకులు తెలిపారు. పది రోజుల క్రితం ఈ చిన్నారిని తల్లిదండ్రులు తీసుకెళ్లారని వారు తెలిపారు. ఈ చిన్నారి ఆచూకీ తెలుసుకునే క్రమంలో గుంతకల్లకు చెందిన మరో చిన్నారిని గుర్తించినట్లు తెలిపారు. ఈ చిన్నారి తల్లిదండ్రులను కర్నూలుకు తీసుకొచ్చి వారితో పాటు గుంతకల్లు పంపించినట్లు వారు తెలిపారు. కర్నూలులోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఈ ముఠా చిన్నారులను అడుక్కునేలా చేస్తోంది. ఆ చిన్నారులకు సరైన ఆహారం కూడా ఇవ్వకుండా గంజాయి, వైట్‌నర్‌కు బానిసలుగా మారుస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వారందరినీ చిల్డ్రన్స్ హోంకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
This is heartbreaking. Every child deserves safety, love, and dignity. We will locate this child and ensure he receives the protection and care he needs. Those responsible for abusing him will be held accountable. @OfficeofNL https://t.co/hwEEQVTcS4
— Lokesh Nara (@naralokesh) November 20, 2024