Minister Nara Lokesh : మంత్రి నారా లోకేష్ అమెరికాలో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన తన బృందంతో అమెరికా చేరుకున్నారు. అయితే సాధారణంగా మంత్రివిదేశీ పర్యటన అంటే చాలా రకాలుగా సందడి ఉంటుంది. అక్కడ జరిగిందానికంటే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే అటువంటి వాటికి అవకాశం ఇవ్వలేదు లోకేష్. ఎటువంటి ఆర్భాటం లేకుండానే.. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలను కలుస్తున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. అయితే ఒక్క స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు లోకేష్. సాధారణంగా మంత్రులు విదేశాలకు వెళ్తే ఎంవోయూలు, ఒప్పందాలు అంటూ హడావిడి నడుస్తుంది. కానీ ఈ విషయంలో లోకేష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ ఒక ఆప్షన్ ఉందని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పరిశ్రమల విస్తరణ చేపట్టాలని పారిశ్రామికవేత్తలు భావిస్తే.. అందుకు ఏపీలో ఉన్న సానుకూలతలను మాత్రమే వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసియాతో పాటు ఇండియాలో పరిశ్రమలు పెట్టాలనుకున్న వారికి ఏపీ స్వర్గ ధామం గా నిలుస్తుందని చెప్పుకొస్తున్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీపై ఒక రకమైన ప్రచారం జరిగింది. ఇక్కడ రాజకీయ అంశాలతో పాటు ఇతర అంశాలు ప్రభావితం చూపుతాయని పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ముందు దానికి చెక్ చెప్పేందుకు లోకేష్ ప్రయత్నించారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు.
* దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చర్చలు
నారా లోకేష్ అమెరికాలో ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలిశారు. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, టెస్లా సి ఎఫ్ ఓ, గూగుల్ ప్రతినిధి బృందాన్ని కలిశారు. వారితో కీలక చర్చలు జరిపారు. కానీ దానిని ప్రచారం చేసుకునేందుకు మాత్రం లోకేష్ పెద్దగా ఇష్టపడలేదు. ఇదిగో పరిశ్రమలు వస్తాయని పెద్ద ప్రకటనలు ఇవ్వడం లేదు. ఏపీలో సానుకూలతలు మాత్రమే వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వతహాగా మార్కెటింగ్ విభాగాలకు సంబంధించి స్వరూపం లోకేష్ కు తెలుసు. అందుకే ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
* సుదీర్ఘ ప్రయోజనాలే ధ్యేయంగా
సాధారణంగా ప్రైవేటు కంపెనీలు, సంస్థలు తమ పెట్టుబడులు పెట్టే సమయంలో, ఉత్పత్తులు విక్రయించే సమయంలో రకరకాల స్ట్రాటజీలను ఫాలో అవుతాయి. సాధారణంగా ఒక ఉత్పత్తి విస్తరించాలంటే డోర్ టు డోర్ ప్రమోషన్లు అవసరం. అయితే ప్రతి ఒక్కరూ ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారన్న లక్ష్యం కంటే… ఒక ఉత్పత్తి ఉందంటూ తెలియడమే ప్రధాన టార్గెట్. ఇప్పుడు లోకేష్ చేస్తోంది అదే. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ఒకటి ఉందని.. అక్కడ సానుకూలమైన అంశాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత, పెట్టుబడులు పెడితే వచ్చే ప్రయోజనాలు.. ఇలా అన్నింటిపై ప్రజెంటేషన్ ఇచ్చే పనిలో ఉన్నారు లోకేష్. అయితే ఇదో అద్భుతమైన ప్రయత్నమని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. తప్పకుండా దీనికి ప్రతిఫలం ఉంటుందని చెప్పుకొస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?