Kinjarapu Krishnamohan Naidu : సిక్కోలు నుంచి మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఉంది. ఇప్పుడు దానిని గుర్తు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత. తాను అధికారంలో ఉండగానే కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని వ్యూహరచన చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 30, 2024 2:29 pm

Kinjarapu Krishnamohan Naidu

Follow us on

Kinjarapu Krishnamohan Naidu : శ్రీకాకుళం అంటే టక్కున గుర్తొచ్చే పేరు కింజరాపు ఎర్రం నాయుడు. జిల్లాలో సుదీర్ఘ రాజకీయాలు చేశారు. కీలక పదవులు అనుభవించారు. 1983లో ఎర్రం నాయుడు ఎమ్మెల్యే అయ్యారు. వరుసగా హరిశ్చంద్ర పురం నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. అసెంబ్లీలో చీఫ్ విప్ గా కూడా వ్యవహరించారు. 1996లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ 2009లో ఓడిపోయారు. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఎర్రం నాయుడు ఇచ్చిన స్ఫూర్తితో ఆ కుటుంబం రాజకీయంగా రాణిస్తూ వచ్చింది. జిల్లాలో తమ ప్రాబల్యాన్ని చాటుతోంది. రాష్ట్రస్థాయిలో సైతం సత్తా చాటింది. అయితే ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసులు పుట్టుకు రావడం విశేషం.

* అన్న ఖాళీ చేసిన స్థానంలో
1996లో ఎర్రం నాయుడు ఎంపీగా పోటీ చేయడంతో హరిశ్చంద్ర పురం అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. దానికి జరిగిన ఉప ఎన్నికల్లో సోదరుడు అచ్చెనాయుడు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. గత రెండు దశాబ్దాలుగా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. చంద్రబాబు క్యాబినెట్లో కీలక పదవులు అనుభవిస్తూ వచ్చారు. తాజాగా కూడా కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు అచ్చన్న.

* తండ్రి అకాల మరణంతో..
2012లో ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. అప్పటివరకు ఎర్రం నాయుడు కు అంత కుమారుడు ఉన్నాడని ఎవరు ఊహించలేదు. కానీ ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో లేదో పరిణితి సాధించారు రామ్మోహన్ నాయుడు. మంచి వాగ్దాటితోపాటు చరిష్మా కలిగిన నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి విజయం సాధించి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. మోడీ సర్కార్లో కీలకమైన పౌర విమానయాన శాఖను సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే క్యాబినెట్ హోదాను దక్కించుకున్నారు.

* వారిద్దరి దీవెనలతో
అయితే కింజరాపు కుటుంబం నుంచి మరో అప్డేట్ వస్తోంది.ఈసారి మంత్రి అచ్చెనాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. బీటెక్ పూర్తి చేసిన కృష్ణమోహన్ నాయుడు ఇటీవల తండ్రి గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2029 ఎన్నికల నాటికి కృష్ణమోహన్ నాయుడుని రంగంలోకి దించాలని తండ్రి భావిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈసారి నరసన్నపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని సమాచారం. రామ్మోహన్ నాయుడు మాదిరిగా పొలిటికల్ ఎంట్రీ ఇప్పించి.. ఎంపీగా ముందు.. తరువాత టెక్కలి ఎమ్మెల్యేగా రాజకీయ పునాదులు ఏర్పరచాలని అచ్చెనాయుడు భావిస్తున్నట్లు సమాచారం. మరి ఆ తండ్రి ఆశలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.