Cold Waves: ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరుస అల్పపీడనాల ప్రభావంతో గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అనేక జిల్లాల్లో చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. అయితే పొడి వాతావరణం కనిపిస్తోంది. ఇదే క్రమంలో చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చెప్పనవసరం లేదు. చిగురుటాకులా వణికిపోతున్నాయి ఆ ప్రాంతాలు. ముఖ్యంగా విశాఖలోని మన్య ప్రాంతం గజగజలాడుతోంది. చలిగాలులతో పాటు పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకే చీకటి వాతావరణం నెలకొంటోంది. ఉదయం 10 గంటల వరకు విపరీతంగా పొగ మంచు కురుస్తూనే ఉంది. దీంతో రహదారులపై రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
* ఈ ప్రాంతాల్లో అధికం
ప్రధానంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతోంది. వర్షాల తీవ్రత తగ్గిన నాటి నుంచి చలి పెరగడం విశేషం. మరో రెండు వారాలపాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా విశాఖలోని అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 9.61 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. ఈనెల 15న అదే ప్రాంతంలో 3.8° ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. అయితే క్రమేపీ పెరుగుతూ మళ్లీ తగ్గుముఖం పట్టడం విశేషం.
* ఉష్ణోగ్రతలు తగ్గుదల
ఉమ్మడి విశాఖలోని మన్య ప్రాంతం చలి గుప్పెట్లో చిక్కుకుంటోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. అరకు సమీపంలోని దళపతి గూడలో 9.89, జిమాడుగులలో 10.5, కుంతళం 10.6, డుంబ్రిగూడ లో 10.73, చింతపల్లిలో 10.85 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక ఉమ్మడి విజయనగరంలోని సీతానగరంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.