Metro projects in AP : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. అదే సమయంలో విజయవాడ తో పాటు విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఆ రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇక్కడ మెట్రో రైలు ఏర్పాటు ద్వారా విదేశీ బ్యాంకు ల నుంచి రుణాలు సేకరించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత బ్యాంకు ప్రతినిధులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఈ మెట్రో రైలు ప్రాజెక్టులు పూర్తయితే.. రెండు నగరాల ప్రజలకు రవాణా మరింత సులభతరం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ దూకుడు చూస్తుంటే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. కానీ సాంకేతికపరమైన కారణాలతో ఈ ప్రాజెక్టుకు ముందడుగు పడలేదు.
* బ్యాంకు ప్రతినిధులతో చర్చ..
అయితే ఇప్పుడు టిడిపి( Telugu Desam Party) కీలక భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం పుష్కలంగా లభిస్తోంది. ఇటువంటి తరుణంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి తాజాగా కీలక అడుగు పడింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు రుణాలను సేకరించే పనిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి పలు విదేశీ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులతో చర్చలు జరిపారు. విశాఖ మెట్రో కు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు.
Also Read : ఏపీ మెట్రో ప్రాజెక్టులు.. కేంద్రం అంగీకరిస్తుందా?
* విజయవాడలో పరిశీలన.. విజయవాడ( Vijayawada) ప్రతిపాదిత మెట్రో క్యారిడార్లను కెఎఫ్ డబ్ల్యు, ఏఎఫ్డి, ఏడిబి, ఎన్డి బి, ఏఐఐబి, జై కా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. అటు తరువాత మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం రుణం గురించి చర్చించారు. త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చిస్తారని సమాచారం. ప్రధానంగా తక్కువ వడ్డీకే రుణం కోసం ఇచ్చే బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నట్లు ఎండి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం పనులు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వాటికి అనుసంధానంగా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభం అయితే.. అంతటా సానుకూలత వ్యక్తం అవుతుందని భావిస్తున్నారు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
* విశాఖలో 46 కిలోమీటర్ల మేర..
విశాఖను ( Visakhapatnam) ఆర్థిక రాజధానిగా ఎనలేని ప్రాధాన్యమిస్తోంది కూటమి ప్రభుత్వం. అక్కడ తొలి దశలోనే 46 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. మూడు కారిడార్లను నిర్మించనున్నారు. విజయవాడలో రెండు దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నారు. మొదటి దశలో రెండు కారిడార్లు, రెండో దశలో మరో క్యారిడార్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుల బిపిఆర్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో మొదటి క్యారీడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఉంటుంది. రెండో క్యారీడారుగా గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. మూడో కారిడార్గా తాటి చెట్ల పాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు ఆరు కిలోమీటర్ల మేర ఉంటుంది. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్ల మేర క్యారిడార్ నిర్మిస్తారు.
Also Read : విశాఖలో మెట్రో.. ఆ మూడు మార్గాల్లో 42 స్టేషన్లు.. సర్వే ప్రారంభం
* విజయవాడలో రెండు కారిడార్లు
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు( Vijayawada metro rail projects ) సంబంధించి మొదటి దశలో రెండు క్యారీడార్లు నిర్మిస్తారు. కారిడార్ వన్ ఏ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ఉంటుంది. కారిడార్ వన్ బి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఉంటుంది. రెండో దశలో క్యారిడార్ త్రీ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు నిర్మిస్తారు. మొదటి దశలో 38.4 కిలోమీటర్లు, రెండో దశలో 27.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. ఈ మెట్రో రైలు ప్రాజెక్టుల తొలిదశ డిపిఆర్ కు ఇప్పటికే ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. వీలైనంత త్వరగా ఈ పనులను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు.