AP Metro Rail: ఏపీ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అభివృద్ధి 20 సంవత్సరాలు పాటు వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణం పై ఫోకస్ చేశారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యమిచ్చారు. అయితే ఈ రెండింటితోనే కాకుండా.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని భావిస్తున్నారు. అందుకు ఉన్న సాధ్యం పరిశీలిస్తున్నారు. ఏ చిన్న అవకాశం వదలడం లేదు. అందులో భాగంగానే గ్రేటర్ గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ను ప్రకటించనున్నారు. 11 మండలాలను అందులో విలీనం చేయనున్నారు. విజయవాడ- అమరావతి- గుంటూరు నగరాలను అనుసంధానం చేయనున్నారు. అందుకు తగ్గ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణా, రైళ్ల మార్గంతో పాటు మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి తో సమీక్షించారు. ఈ నాలుగేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో మెట్రో రైలు తిరగాలని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు.
* పర్యాటకంగా ఊపు
మరోవైపు విశాఖలో వీలైనంత త్వరగా మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పర్యాటకంగా దేశంలోనే విశాఖకు మంచి గుర్తింపు ఉంది. మెట్రో రైలు అందుబాటులోకి తెస్తే పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. విశాఖ నగరం నిడివి దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇటు అనకాపల్లి, మరోవైపు కొత్తవలస, ఇంకోవైపు భీమిలి, మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వరకు మెట్రో రైలు విస్తరణకు అవకాశం ఉంది. మెట్రో రైలు మార్గం వస్తే విశాఖ నగరం దశ మారుతుందని భావిస్తున్నారు.
* వచ్చే నాలుగేళ్లలో పూర్తి
విశాఖలో సుందరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల అవసరాలకు తగ్గట్టు రవాణా లేదు. ఇటువంటి సమయంలో మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే వచ్చే నాలుగు సంవత్సరాలలో మెట్రో రైలు ఏర్పాటు వైజాగ్ లో జరపాలన్నది చంద్రబాబు లక్ష్యం. రెండు దశల్లో విశాఖలో మెట్రో నిర్మించబోతున్నారు. ఫేస్ 1 లో 46 కిలోమీటర్ల మేర 11400 కోట్ల రూపాయలతో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. రెండో పేజ్ లో భాగంగా 30 కిలోమీటర్ల మేర 5734 కోట్లతో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫేజ్1 ను నాలుగేళ్లలో పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు విజయవాడలో 38 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు 11 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. మొత్తానికైతే ఏపీలో మెట్రో కూత మరో నాలుగేళ్లలో వినిపించనుందన్న మాట.
* అభివృద్ధి చెందిన నగరాల్లో కీలకం
దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాదులో మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత నగరం మారిపోయింది. కొత్త శోభ వచ్చింది. ఇప్పుడు అలానే విశాఖ తో పాటు విజయవాడను చూసుకోనున్నాం. తన ఐదేళ్ల పదవీకాలంలో మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తేవాలని చంద్రబాబు బలమైన సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.