Mekapati Chandra Sekhar Reddy: జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy) రాజకీయంగా చాలా కుటుంబాలు అండగా నిలిచాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు తమ సొంత పార్టీలను వదిలి జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. కానీ ఆ పార్టీలో అనుకున్న స్థాయిలో గుర్తింపు సాధించుకోలేకపోయారు. దీంతో ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మరో పొలిటికల్ ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అటు జగన్మోహన్ రెడ్డి సైతం ఆ ఫ్యామిలీని లైట్ తీసుకోవడంతో ఇక పార్టీలో ఉండడం భావ్యం కాదని భావిస్తున్నట్లు సమాచారం. వారి స్థానంలో ప్రత్యామ్నాయ నేతను బరిలోదించేందుకు అప్పుడే అన్వేషణ ప్రారంభించారట జగన్మోహన్ రెడ్డి. దీంతో ఆ ఫ్యామిలీ వ్యాపార కార్యకలాపాలకు పరిమితమైంది. ఎన్నికల ముంగిట ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది.
జగన్ తరువాత ఎంపీగా..
కాంగ్రెస్ పార్టీని( Congress Party) విభేదించి జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి ఫ్యామిలీ చేరింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్. 1989 నుంచి ఆయన ఎంపీ గానే పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు ఎంపీ పదవిని వదులుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు కూడా. 2014 ఎన్నికల్లో సైతం ఆయనే సత్తా చాటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆయన బదులు కుమారుడు గౌతమ్ రెడ్డి రంగంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత నేత గౌతమ్ రెడ్డి. ఆయన వల్లే ఆ ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2019 ఎన్నికల్లో గౌతంరెడ్డి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అయితే 2022లో చనిపోయారు గౌతమ్ రెడ్డి. ఆయన స్థానంలో తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జగన్ మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. అప్పటినుంచి మేకపాటి ఫ్యామిలీలో ఒక రకమైన అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.
బడా నేత కోసం ప్రయత్నం..
గత ఎన్నికలకు ముందు మేకపాటి రాజమోహన్ రెడ్డి( Raja Mohan Reddy ) సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు జగన్. అయితే నెల్లూరు జిల్లాలో నేతలంతా బయటకు వెళ్లిపోవడంతోనే జగన్ మేకపాటి ఫ్యామిలీకి రెండో టిక్కెట్ కల్పించారు. కానీ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజమోహన్ రెడ్డి కి ప్రాధాన్యత తగ్గించారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో వ్యాపారాలు పై దృష్టి పెట్టింది మేకపాటి ఫ్యామిలీ. ఇటీవల నెల్లూరు వచ్చిన రాజమోహన్ రెడ్డి పార్టీ అధినేత తీరు మార్చుకోవాలని సూచిస్తూ విలువైన సలహాలు ఇచ్చారు. అయితే దీనిని సానుకూలంగా తీసుకోకుండా ప్రతికూలంగా తీసుకున్నట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన స్థానంలో టిడిపిలో ఉన్న ఒక బడా నేతను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం టిడిపిలో ఎంపీగా ఉన్న ఓ నేతను నెల్లూరుకు రప్పించి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అతని కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తానని కూడా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే ఈ పరిస్థితులు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ సీనియర్ నేత దూరమైనట్టే.