Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ కి( Mega DSC) సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. దరఖాస్తుల గడువు ముగిసింది. గత నెల 20న ఏపీలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 16 వేల కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. అన్ని పోస్టులకు కలిపి దాదాపు 5,67,417 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లు మే 30న విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తరువాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈనెల 15తో దరఖాస్తుల గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది.
* హామీ అమలు..
తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను పూర్తి చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్న క్రమంలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. అది కొలిక్కి వచ్చిన తరువాతనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఒకసారి కూడా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఓ 6000 పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. కానీ ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 10 వేల పోస్టులను జతచేస్తూ.. 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ని ప్రకటించింది.
Also Read : ఏపీ డీఎస్సీ.. దరఖాస్తు సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
* కర్నూలు జిల్లా నుంచి అధికం..
మెగా డీఎస్సీ కి సంబంధించి గత నెల 20న నోటిఫికేషన్( notification) ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అప్పటినుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. మే 15 వరకు కొనసాగింది. చాలామంది అభ్యర్థులు వారికున్న అర్హతలకు బట్టి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఏడువేల మంది వరకు డీఎస్సీకి అప్లై చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా నుంచి దాదాపు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కడప జిల్లా నుంచి అత్యల్పంగా 15,812 మంది దరఖాస్తు చేసుకున్నారు.
* 30 నుంచి హాల్ టికెట్లు..
మే 30 నుంచి హాల్ టికెట్ల ( hall tickets )జారీ ప్రక్రియ ఉంటుంది. ప్రభుత్వం వెబ్సైట్ నుంచి అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో హాల్ టికెట్లు పొందే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 20 నుంచి మాక్ టెస్టులు రాసి ఆప్షన్ రానుంది. ఏపీవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై ఆరు వరకు నెలరోజుల పాటు జరుగుతాయి. సి బి టి విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తానికి అయితే దాదాపు 5 లక్షలకు పైగా అభ్యర్థులు.. తమ భవిష్యత్తు కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు.