Mega Brothers: మెగా కుటుంబం మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. దేశంలోనే సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ సందర్భాల్లో మంత్రులు అయిన ఘనత కొణిదెల కుటుంబానికే దక్కుతుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు నాగబాబు ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అతి సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనతి కాలంలోనే హీరోగా గుర్తించబడ్డారు. విపరీతమైన స్టార్ డంను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన నట వారసుడిగా నాగబాబును రంగంలోకి దించారు. రాక్షసుడు సినిమాలో నటుడిగా పరిచయం చేశారు. అటు తరువాత నాగబాబు హీరోగా చాలా సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అటు తరువాత నిర్మాతగా అవతారం ఎత్తారు. అంజనీ ప్రొడక్షన్స్ ఏర్పాటు చేశారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బుల్లితెరలో హోస్ట్ గా వ్యవహరించారు నాగబాబు.ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పనవసరం లేదు. తనకంటూ సినీ పరిశ్రమలో ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అపజయాలతో మొదలైన ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం.. అదే స్థాయిలో సక్సెస్ కూడా అందుకుంది. కానీ మెగాస్టార్ సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. కానీ రాజకీయాల్లో అనుకున్నంత రాణించలేకపోయారు. ఆ లోటును భర్తీ చేశారు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
* ప్రజారాజ్యం పార్టీతో..
2009లో ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సమయంలో అన్నదమ్ములిద్దరూ చిరంజీవికి అండగా నిలబడ్డారు. కానీ ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే అక్కడ కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది ప్రజారాజ్యం. అప్పట్లో చిరంజీవి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. పర్యాటక శాఖ మంత్రిగా ఇండిపెండెంట్ హోదాలో పనిచేశారు.
* జనసేనతో పవన్
2014 రాష్ట్ర విభజనకు ముందు జనసేన ను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు. దీంతో ఆ రెండు పార్టీలు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో పవన్ నిర్ణయాత్మక శక్తిగా ఆ ఎన్నికల్లో నిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఒంటరి పోరాటానికి దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో వామపక్షాలతో పాటు బీఎస్పీ తో పొత్తు పెట్టుకున్నారు. కానీ దారుణ పరాజయం చవి చూశారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. గత ఐదేళ్లుగా దారుణ అవమానాలకు గురయ్యారు. అయితే సంక్షోభాలను, సవాళ్లను అధిగమించి జనసేన ను నిలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి కట్టి ఏకపక్ష విజయం సాధించారు. ఏపీ డిప్యూటీ సీఎం తో పాటు ఆరు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
* ఇప్పుడు నాగబాబు
అయితే 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నాగబాబు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు.ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ కూటమి సమీకరణల దృష్ట్యా అవకాశం దక్కలేదు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్దాం అనుకున్నా బిజెపి పెద్దల కోరిక మేరకు రాజ్యసభ పదవిని వదులుకున్నారు పవన్. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఏపీ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించారు. నిన్ననే అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా పని చేయడం అనేది ఒక రికార్డుగా చెప్పవచ్చు. అందునా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఈ ఘనత సాధించడం మరీ విశేషం.