Media on Kaleshwaram project: తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఒక కుదుపు కుదుపుతోంది. ఇందులో అక్రమాలు జరిగాయని అధికార కాంగ్రెస్.. లేదు లేదు అంత సక్రమంగానే ఉందని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. నిజానికి అధికార కాంగ్రెస్ తన కోణంలో తన చెబుతుంది. అఫ్కోర్స్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తన విధానంలో తను చెబుతుంది. మరి అసలు విషయాలు ఎవరు చెప్పాలి.. నిజాలు ఎవరు వివరించాలి..
ఇదిగో ఇలాంటప్పుడే మీడియా తన పాత్ర పోషించాలి. తన వాచ్ డాగ్ వ్యవహారాన్ని బయటపెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మీడియా వాచ్ డాగ్ పాత్ర నుంచి దూరం జరిగి చాలా రోజులైంది. రాజకీయ పార్టీలకు.. రాజకీయ నాయకులకు డప్పు కొట్టే వ్యవహారం లాగా మారిపోయి చాలా రోజులైంది. అందువల్లే నిజాలు ఏమిటో.. అబద్ధాలు ఏమిటో తెలియని పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. గులాబీ అనుకూల మీడియా ఓపెన్ చేస్తే కాలేశ్వరం గొప్పగానే కనిపిస్తోంది.. కాంగ్రెస్ అనుకూల మీడియాను ఓపెన్ చేస్తే కాలేశ్వరం చెత్త ప్రాజెక్టు లాగా కనిపిస్తోంది.. కాలేశ్వరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను ఆదివారం శాసనసభలో ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రజలను శాసనసభలో ఉన్న సభ్యులందరికీ పంచారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు ఆ కమిషన్ నివేదిక ఏమిచ్చింది.. అందులో ఏముంది అనే విషయాన్ని ఓ పత్రిక సరిగ్గా నెల క్రితమే బయటపెట్టింది. వాస్తవానికి ఈ తరహా వార్తను సర్క్యులేషన్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న పత్రికలో వస్తుందని అందరూ ఊహించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మూడో స్థానంలో ఉన్న పత్రిక ఈ విషయాన్ని బయటపెట్టింది. తద్వారా తనకున్న జర్నలిస్ట్ టెంపర్మెంట్ ను రుజువు చేసుకుంది. అలాగని ఆ పత్రిక మేనేజ్మెంట్ గొప్పదని చెప్పడం లేదు. నీతి నిజాయితీతో కొనసాగుతుందని వివరించడం లేదు.
ప్రజలకు కొన్ని విషయాల మొహమాటం లేకుండా చెప్పాలి. అందులో దాపరికానికి తావు ఇవ్వకూడదు.. ఎందుకంటే ఇవి వెనుకటి రోజులు కావు. అన్నింటికంటే ముఖ్యంగా నిజాలను దాచే రోజులు కావు. సోషల్ మీడియా బలంగా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో వెంటనే తెలిసిపోతుంది. పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు వేరు చేసే తీరుగా సోషల్ మీడియా వ్యవహరిస్తున్నది . అలాంటప్పుడు ప్రధాన మీడియా కొన్ని విషయాలను దాచడంలో అర్థం లేదు. నెంబర్ వన్ స్థానంలో ఉన్న పత్రిక కాలేశ్వరంలో జరిగిన వ్యవహారాల గురించి సోమవారం ప్రచురించింది. అంటే మూడో స్థానంలో ఉన్న పత్రిక ప్రచురించిన నెల తర్వాత మొదటి స్థానంలో ఉన్న పత్రిక మేల్కొంది. అంటే అప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న పత్రిక యాజమాన్యానికి ఈ విషయాలు తెలియలేదా.. తెలిసినా కూడా పట్టించుకోలేదా.. ఇక్కడిదాకా వస్తుందని అనుకోలేదా.. అసలు ఇంత భయపడి పత్రికను నడపాల్సిన అవసరం ఏముంది.. ప్రభుత్వ నియమించిన కమిటీ నివేదికలో అంశాలు లీక్ అయినప్పుడు వాటిని తన బాధ్యతగా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఆ మేనేజ్మెంట్ కు ఉంటుంది కదా.. ఇదిగో ఇలాంటప్పుడే పత్రిక అసలు రంగు బయటపడుతుంది. అసలు రంగు ఏమిటో ప్రజలకు తెలుస్తుంది..