Manthena Satyanarayana Raju: ప్రభుత్వ సలహాదారులు అంటేనే లక్షలాది రూపాయల జీతం, అదే స్థాయిలో అలవెన్సులు, విమాన టిక్కెట్లు.. ఇలా ఒకటేమిటి? చాలా రకాల సౌకర్యాలు ఉంటాయి. అందుకే సలహాదారుడు అంటేనే ఎగిరి పడిపోతారు. అందులోనూ క్యాబినెట్ ర్యాంకుతో కూడిన సలహాదారు పదవి అంటే.. ఆ దర్పమే వేరు. కానీ అవేవీ వద్దు కేవలం సలహాలు మాత్రమే ఇస్తామంటున్నారు ఏపీలో నియామకమైన సలహాదారులు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలని సూచిస్తూ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు( Chaganti Koteswara Rao ) క్యాబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవి ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఏ సౌకర్యం వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు చాగంటి. ఇప్పుడు మరో సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు కూడా అదే పద్ధతిని అనుసరించారు. తనకు ఇచ్చిన సౌకర్యాలు వద్దని.. అసలు సలహాదారు పదవి అనేది వద్దని.. ప్రభుత్వం మంచి ఆశయంతో తనకు ఇచ్చింది కనుక అదే ఆశయంతో పని చేస్తానని మంతెన సత్యనారాయణ రాజు ఏకంగా సీఎం చంద్రబాబుకు తేల్చి చెప్పడం విశేషం.
* ప్రకృతి వైద్యుడిగా గుర్తింపు..
మంతెన సత్యనారాయణ రాజును( Manthena Satyanarayana Raju ) ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకృతి వైద్య సలహాదారుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఆశ్రమం నిర్వహణతో పాటుగా ఆరోగ్యపరమైన సూచనలు.. సలహాలు ఇవ్వడం ద్వారా మంతెన సత్యనారాయణ రాజు ప్రముఖంగా గుర్తింపు పొందారు. ఆయనకు ప్రకృతి వైద్య రంగంలో ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించిన విధానాలపై ప్రభుత్వానికి డాక్టర్ రాజు సలహాలు సూచనలు అందించనున్నారు. ఆయన ఎప్పటికీ అమరావతి సమీపంలో మంతెన ఆరోగ్యాలయం పేరిట ప్రకృతి చికిత్సా లయంతో పాటు పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
* ఆ సౌకర్యాలు వద్దు..
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియామకం అయిన తర్వాత మంతెన సత్యనారాయణ రాజుకు క్యాబినెట్ హోదా( cabinet status) కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో కృతజ్ఞత తెలిపేందుకు సీఎం చంద్రబాబును కలిశారు సత్యనారాయణ రాజు. 35 సంవత్సరాల సత్యనారాయణ రాజు సేవలను సీఎం చంద్రబాబు కొనియాడారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. సంజీవని ప్రాజెక్టు వంటి అనేక ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తోందని.. అందుకే మిమ్మల్ని సలహాదారుగా తీసుకున్నట్లు మంతెన సత్యనారాయణ రాజు తో చంద్రబాబు అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించాలని కోరారు. దీనిపై స్పందించిన మంతెన సత్యనారాయణ రాజు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను ఏ హోదాలు, పోస్టులు తీసుకోకూడదని నియమాన్ని పెట్టుకున్నట్లు తెలిపారు. కచ్చితంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందిస్తానని.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని పేర్కొన్నారు. అయితే హోదా లేకపోతే మాటలకు గౌరవం ఉండదని, ఆచరణలోకి వెళ్ళదని, పదవిలో ఉండి చెబితే అమలుకు అవకాశాలు ఎక్కువ అని చంద్రబాబు ఆయనకు వివరించారు. దీనివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పేసరికి మంతెన సత్యనారాయణ రాజు ఒప్పుకున్నారు. అయితే క్యాబినెట్ హోదాతో వచ్చే ఏ సదుపాయాలను తాను తీసుకోనని స్పష్టం చేశారు. నెల జీతము, ప్రభుత్వ కారు, ఇతర ఖర్చులు, ఇంట్లో సహాయకుల జీతాలు, విమాన రైలు టికెట్లు, కార్యాలయాల సదుపాయాలు వంటివి స్వీకరించినని స్పష్టం చేశారు. దీంతో మంతెన అభిప్రాయాలకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.