Mantha Cyclone: భారీ తుఫాను( heavy cyclone) నేపథ్యంలో.. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ తుఫాన్ భారీ వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. సాయంత్రానికి కానీ.. రాత్రికి కానీ తీరం దాటే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడే జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ క్రమంలో విజయవాడ, రాజమండ్రి నుంచి విమాన సర్వీసులను చాలా సంస్థలు రద్దు చేశాయి. విశాఖ, హైదరాబాద్, తిరుపతి రూట్ లలో వెళ్లే రైళ్లు సైతం రద్దయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీ సుదూర సర్వీసులను సైతం రద్దు చేసింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
* విమాన రాకపోకలకు అంతరాయం..
ప్రధానంగా విశాఖ( Visakhapatnam), విజయవాడ నుంచి విమాన సర్వీసులు రద్దు కావడం విశేషం. సోమవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసు రద్దయింది. విజయవాడ నుంచి 46 సర్వీస్ లు నడుస్తుండగా.. మంగళవారం ఏకంగా 36 సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ నుంచి షార్జాకు నడిచే రెండు సర్వీసులను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. విజయవాడ -విశాఖ మధ్య రెండు, విజయవాడ- బెంగళూరు మధ్య రెండు, విజయవాడ- హైదరాబాద్ మధ్య రెండు సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లే 18 ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు సైతం రద్దయ్యాయి. విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం నుంచి అన్ని రకాల విమాన సర్వీసులు రద్దయ్యాయి.
* 72 రైళ్లు రద్దు..
తుఫాను దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే( South Central Railway) పరిధిలో 72 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది రైల్వే శాఖ. అటు తెలంగాణ, ఇటు ఒడిస్సా, మరోవైపు చెన్నై నుంచి ఏపీ మీదుగా రాకపోకలు సాగించే దాదాపు అన్ని రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన రైళ్ల సర్వీసుల వివరాలను ప్రయాణికుల మొబైల్ ఫోన్ లకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక విజ్ఞప్తి చేసింది. ప్రజలు అత్యవసరమైతేనే రైళ్ళలో ప్రయాణం చేయాలని సూచించింది. ఎప్పటికప్పుడు తమ ప్రయాణానికి సంబంధించి రైలు స్టేటస్ చెక్ చేసుకోవాలని కూడా సూచించింది. రద్దయిన రైళ్ల జాబితాలో విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ గరీబ్ రథ్, ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ, తిరుపతి మధ్య నడిచే డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ తో పాటు చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్లు, పాసింజర్ రైలు ఉన్నాయి. మరోవైపు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను సైతం ఏర్పాటు చేశారు.
* ఏపీఎస్ఆర్టీసీ సైతం..
తుఫాను దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ( APSRTC) సైతం అప్రమత్తమయింది. భారీ ఈదురుగాలుల నేపథ్యంలో అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే బస్సులు నడపాలని ఆదేశించారు. ప్రధానంగా నీటిముంపు బాధిత ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేయాలన్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు మాత్రం బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల వినతి మేరకు వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు ఆర్టీసీ ఎం డి.