Ambedkar Konaseema District : ఎవరైనా పుట్టినరోజు నాడు కేక్ కట్ చేస్తారు.లేకుంటే ఏదైనా విజయం సాధిస్తే దానికి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు.కానీ ఓ వ్యక్తినిరసన తెలిపేందుకు కేక్ కట్ చేయడం విశేషం. ఏకంగా కలెక్టరేట్లోకి వెళ్లి మరి కేక్ కట్ చేసి తన నిరసన వ్యక్తం చేశారు. తన సమస్య పరిష్కారం కాకపోవడంతోనే తాను ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఈ ఆసక్తికర సన్నివేశం వెలుగులోకి వచ్చింది. కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రశేఖర్ అనే ఒక అర్జీదారు వచ్చారు. తన సమస్యపై అక్కడే నిరసన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాది కిందట అధికారులకు వినతి పత్రం అందించినట్లు తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు చంద్రశేఖర్.ఈ క్రమంలో ఆయన అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏకంగా కేక్ కట్ చేసి నిరసన తెలపడం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
* ఏడాది కిందట ఫిర్యాదు
అర్జీదారుడు కోట చంద్రశేఖర్ ది రావులపాలెం గా తెలుస్తోంది. పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన ఏడాది కిందట ఒక సమస్యపై స్పందన విభాగంలో ఫిర్యాదు చేశారు. రావులపాడు లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది అన్నది ఆ ఫిర్యాదు సారాంశం.అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడం, ఫిర్యాదు చేసింది టిడిపి నేత కావడంతో సమస్యకు పరిష్కార మార్గం చూపలేకపోయారు అధికారులు. ఈ తరుణంలో ఈ నెల రెండున మరోసారి చంద్రశేఖర్ అదే అంశంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకుండా పోయాయి. అందుకే వినూత్నంగా ఇలా కేక్ కట్ చేసి నిరసన తెలిపినట్లు బాధితులు చెబుతున్నారు.
* పిటిషన్ కు ప్రథమ సంవత్సరం
సోమవారం ఉదయం స్పందన విభాగం ప్రారంభమైంది.అధికారులు ఫిర్యాదులు తీసుకోవడం ప్రారంభించారు.ఇంతలో చంద్రశేఖర్ అక్కడకు చేరుకున్నారు. తన వెంట తెచ్చుకున్న కేక్ కట్ చేసే ప్రయత్నం చేశారు. కేక్ పై పిటిషన్ ప్రథమ వార్షికోత్సవం అని ఇంగ్లీషులో రాసి ఉంచారు. కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు వినతులు స్వీకరిస్తున్నారు. వారి వద్దకు వెళ్లిన చంద్రశేఖర్ కేక్ కట్ చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు.వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే.. వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడతానని చంద్రశేఖర్ చెబుతున్నారు. మొత్తానికైతే అధికార పార్టీ నేత వినూత్న నిరసన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది