Mahasena Rajesh: మహాసేన రాజేష్ బాధ అంతా ఇంతా కాదు

గత ఎన్నికల్లో మహాసేన రాజేష్ వైసీపీకి అనుకూలంగా పనిచేశారు.ఆ పార్టీకి ప్రచారం కూడా చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాసేన రాజేష్ కు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు.

Written By: Dharma, Updated On : March 18, 2024 2:42 pm

Mahasena Rajesh

Follow us on

Mahasena Rajesh: ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఈ విషయంలో అధికార వైసిపి ముందంజలో ఉంది. ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను.. 24 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. టిడిపి,జనసేన, బిజెపి కూటమి కట్టాయి. సీట్లను సైతం సర్దుబాటు చేసుకున్నాయి. కానీ అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీ 144 స్థానాలకు గాను 128 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి జాబితాలో 94 మందిని.. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో చాలామంది సీనియర్లను పక్కన పెట్టగా.. అనూహ్యంగా కొంతమంది జూనియర్లకు చోటు దక్కింది. అటువంటి వారిలో మహాసేన రాజేష్ ఉన్నారు. ఆయనకు తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గాన్ని కేటాయించారు. కానీ అభ్యంతరాలు రావడంతో ఆ సీటు విషయంలో మార్పులు చేశారు. దీనిపై మహాసేన రాజేష్ గరం గరం అవుతున్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత ఎన్నికల్లో మహాసేన రాజేష్ వైసీపీకి అనుకూలంగా పనిచేశారు.ఆ పార్టీకి ప్రచారం కూడా చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాసేన రాజేష్ కు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దీంతో రాజేష్ మహాసేన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి.. రాజకీయ విశ్లేషణలు చేయడం ప్రారంభించారు. బాగా ఫేమస్ అయ్యారు. వైసీపీ పై వ్యతిరేకతతో తొలుత జనసేన వైపు, తరువాత టిడిపి వైపు అడుగులు వేశారు. జనసేన అధినేత పవన్ కు మద్దతుగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గళమెత్తారు. దీంతో జనసేనలో చేరతారని భావించారు. కానీ ఆయన అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు.చాలా యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించారు.దీంతో చంద్రబాబు ఆయనకు పి.గన్నవరం టికెట్ ను కేటాయించారు.

అయితే మహాసేన రాజేష్ గతంలోనడిపిన వ్యవహారంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. వైసిపికి అనుకూలంగా పనిచేసినప్పుడు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. కులం, మతం వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతికూలంగా మారాయి. జనసేనతో పాటు టిడిపి శ్రేణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అటు హిందూ ధార్మిక సంఘాలు సైతం ఆయన వ్యవహార శైలిని తప్పుపట్టాయి. దీంతో మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇప్పుడు నియోజకవర్గంలో ఒక సర్వే జరుగుతోంది. జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ స్పందించారు. రెండు నెలల కిందట వరకు తాను ప్రశాంత జీవితాన్ని గడిపానని.. ఇప్పుడు టార్చర్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా జనసేనకు ఈ నియోజకవర్గ టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి తానే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిని అని గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పే వరకు తానే కొనసాగుతానని.. అంతవరకు ఊరుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇది తనను అవమానించడమేనని రాజేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.