Mahanadu : వైసీపీ సర్కారు సైతం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించింది. విజయవాడలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల వేళ..రాజమండ్రిలో నిర్వహిస్తున్న మహానాడుకు పోటీగా చేపట్టిన కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ చైర్మన్ పోసాని కృష్ణమురళీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతల మాటల తూటాలు పేలాయి. చంద్రబాబుతో పాటు నందమూరి వారసులను టార్గెట్ చేసుకుంటూ కామెంట్స్ సాగాయి.
ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి వారంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ వారసత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారు. కుడుపున పుడితే వారసులు కాదు. ఎన్టీఆర్ కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు. ఎన్టీఆర్ కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమే. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్ కు అసలైన వారసుడు అంటూ తేల్చేశారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకునే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన మహా నాయకుడు జగన్ అని లక్ష్మీపార్వతి అన్నారు. క్లిష్ణ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా నిజాలు బయట ప్రపంచానికి తెలియజెప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణమురళీకి జీవితాంతం రుణపడి ఉంటానని లక్ష్మీపార్వతి అన్నారు.
లక్ష్మీపార్వతిని చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబం ఎన్నోరకాల ఇబ్బందులకు గురిచేసిందని పోసాని కృష్ణమురళీ గుర్తుచేశారు. వాటన్నింటినీ తట్టుకొని నిలబడిన మహిళ లక్ష్మీపార్వతి అన్నారు. జీవిత చరమాంకంలో ఎన్టీఆర్ కు సపర్యలు చేశారని గుర్తుచేశారు. కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ స్క్రాప్ బ్యాచ్ రాజమండ్రిలో మహానాడు అంటూ ఈవెంట్ జరుపుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ చేశారు. ఎన్టీఆర్ పేరుతో ప్రజల కు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని ఎన్టీఆర్ ఉంటే పార్టీ రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని నాని వ్యాఖ్యానించారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఓ రేంజ్ లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎవరైతే ఎన్టీఆర్ చావుకు కారణమో.. వారే ఇప్పుడు అభిషేకాలు చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.రాజమండ్రిలో ఈ రోజు ఒక జోక్ జరుగుతోందని చెప్పిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు ఎలాంటి వాడో ఎన్టీఆర్ స్వయంగా చెప్పారని వివరించారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అంటే ఎన్టీఆర్ కు అవగాహన లేదా అని ప్రశ్నించారు. అవగాహన లేని వ్యక్తికి దండలు ఎందుకు వేస్తున్నారని ఆర్జీవీ నిలదీసారు. ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని..వీళ్ళతో పాటు వేదిక పంచుకోకుండా ఒక విధానానికి కట్టుబడ్డారంటూ ఆర్జీవి ప్రశంసించారు. మొత్తానికై టీడీపీ మహానాడు జరుగుతున్న వేళ వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.