Mahanadu: ఈ ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) దారుణంగా దెబ్బతిన్నారు. ఆయన నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ.. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. చివరకు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా హవా చాటింది కూటమి. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు గాను ఏడు చోట్ల పాగా వేసింది. జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు మాత్రమే కడప నుంచి గెలిచారు. అదే సమయంలో కడప పార్లమెంటు స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అవినాష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. అయితే కడప జిల్లాలో సాధించిన పట్టుతో వ్యూహం రూపొందిస్తున్నారు చంద్రబాబు.
Also Read: యాక్షన్ లోకి సోము వీర్రాజు.. మైక్ కనిపిస్తే జగనే టార్గెట్!
* ఈసారి పులివెందులలో మహానాడు..
ఏటా మహానాడు( mahanadu ) ను వేడుకగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. గత ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో మహానాడు జరగలేదు. అధికారంలోకి రావడంతో దూకుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తోంది. అది కూడా కడప జిల్లాలో నిర్వహించాలని భావిస్తోంది. అయితే కడప జిల్లా నేతలు సైతం.. పులివెందులలోనే మహానాడు నిర్వహించాలని అధినేతకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అన్నీ కుదిరితే పులివెందులలోనే మహానాడు జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరినట్టే.
* 27న ఉప ఎన్నిక..
మరోవైపు కడప జిల్లా పరిషత్ చైర్మన్( Kadapa Jila Parishad chairman ) స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈనెల 27న అక్కడ జడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. అయితే దూకుడు మీద ఉన్న టిడిపి కూటమి ఎలాగైనా జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతుంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది. ఆ పార్టీ జడ్పిటిసి లను బెంగళూరు, హైదరాబాద్ శిబిరాలకు తరలించినట్లు తెలుస్తోంది.
* ప్రలోభాలకు భయపడి..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress party )జడ్పిటిసి సభ్యులతో టిడిపి ఇప్పటికే మాట్లాడిందని.. వారు కూటమి వైపు వచ్చేందుకు మొగ్గు చూపారని.. దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వారికి ఇచ్చేందుకు బేరం కూడా జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక జడ్పిటిసి సభ్యుడు ఉన్నారు. మొత్తం 50 జెడ్పిటిసిలకు గాను అప్పట్లో ఎన్నికలు జరగగా.. 49 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలిచారు. అయితే ఓ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆపై అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో 47 మంది జడ్పిటిసిలు మాత్రమే ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపికి 9 మంది జడ్పిటిసిల మద్దతు లభించింది. మిగతా 38 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వీరిని టిడిపి కూటమి ప్రలోభ పరిచే అవకాశం ఉందని అనుమానిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్. అందుకే క్యాంపు రాజకీయాలకు తెర తీసినట్లు సమాచారం.