Mahanadu : మహానాడు.. ఎండలోనూ పసుపు దళంలో ఉరకలేసిన ఉత్సాహం

అందుకు తగ్గట్టుగా టీడీపీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ముఖ్యంగా పార్టీ శ్రేణులకు ఎండ బాధ తగులకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, భోజనం, నీడ వంటి వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

Written By: Dharma, Updated On : May 28, 2023 1:08 pm
Follow us on

Mahanadu : తెలుగుదేశం పార్టీ ఊపు మీద ఉంది. రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడు హీట్ పుట్టిస్తోంది. నేతల ప్రసంగాలు ఎండ కంటే ఎక్కువగా సెగలు పుట్టిస్తున్నాయి. చంద్రబాబు, అచ్చెన్నలు మొదలు కొని నాయకుల ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి. కేడర్ లో జోష్ ను నింపుతున్నాయి. తొలిరోజు ప్రతినిధుల సమావేశం సక్సెస్ ఫుల్ గా నడిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారని అంచనా. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి.. టీడీపీ అధికారం చేపడుతుందన్న బలమైన నమ్మకం కల్పించడంలో మాత్రం టీడీపీ నాయకత్వం సక్సెస్ అయ్యింది. ఇదే ఊపు నేడు కూడా కొనసాగనుంది.

45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఒక వైపు.. రోహిణీ కార్తెలతో వీస్తున్న వడగాలులు ఒక వైపు తెలుగు తమ్ముళ్లనుసెగలు పుట్టిస్తున్నాయి. అయితే అంత వేడిని కూడా తట్టుకొని ఉరకలేసి వస్తున్న టీడీపీ సైనికులకు మాత్రం జోహార్ చెప్పాల్సిందే. భారీ ఎత్తున  మహానాడు ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండను తట్టుకునేలా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. కానీ ఎండల తాకిడికి చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. ఎండదెబ్బను తట్టుకోలేక చాలా మంది కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. అలా సొమ్మసిల్లిన వారికి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో చికిత్సను వెంటనే అందిస్తున్నారు.ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు ఉక్క బోతల నేపధ్యంలో మహానాడు జరుగుతోంది. వైసీపీ మీద కసిగా ఉన్న పసుపు దళం ఈసారి అధికారం ఎట్టి పరిస్థితులో అందుకోవాలని చూస్తోంది. దాంతో నేతలు కూడా క్యాడర్ ఉత్సాహం చూసి ప్రసంగాలను ఫుల్ మాస్ అప్పీల్ తో కొనసాగిస్తున్నారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే ఏకంగా గాండ్రించారు. ఆయన ప్రసంగం మహానాడులో హైలెట్ గా నిలిచింది.  డైలాగులు డైనమైట్లుగానే పేల్చారు. చంద్రబాబు సైతం తన ప్రసంగంలో వాడిని వేడిని పెంచారు. మహానాడు ఒక పదునైన బ్రహ్మాస్త్రంగా వైసీపీ ప్రభుత్వం మీద వాడాలన్న పార్టీ అధినాయకత్వం ఆశయం తొలి రోజు వచ్చిన స్పందనను చూస్తే పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది అనే అంటున్నారు. మొత్తానికి మహానాడు రెండవ రోజు మీదనే ఫోకస్ పెట్టి అంతా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ముగింపు సభలో ఇచ్చే పిలుపు రామబాణంగా మారి ఏపీలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశానికి అధికారాన్ని అందిస్తుందని అంతా గట్టిగా నమ్ముతున్నారు.

అయితే ఈ రోజు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతోంది. అయితే రెండోరోజు సభకు లక్షలాది మంది జనాలు తరలివచ్చే అవకాశముంది. అందుకు తగ్గట్టుగా టీడీపీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ముఖ్యంగా పార్టీ శ్రేణులకు ఎండ బాధ తగులకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, భోజనం, నీడ వంటి వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.