Homeజాతీయ వార్తలుKCR - NTR : కెసిఆర్ ధరణి కంటే.. ఎన్టీఆర్ ఒక్క కలం పోటు.. తెలంగాణ...

KCR – NTR : కెసిఆర్ ధరణి కంటే.. ఎన్టీఆర్ ఒక్క కలం పోటు.. తెలంగాణ భూ స్వరూపాన్నే మార్చింది

KCR – NTR : “మేము ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చాం. తెలంగాణలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఇది పెద్ద గేమ్ చేంజర్. ఇకనుంచి ఎటువంటి లంచాల బెడదలు ఉండవు”..అని కదా కెసిఆర్ పదేపదే చెప్తుంటాడు. కానీ కెసిఆర్ ఆలోచనల కంటే ముందే అంటే ఒక నాలుగు దశాబ్దాల కాలాన్ని ముందే ఊహించి ఆచరణలో పెట్టినవాడు ఎన్టీఆర్. అంతేకాదు రెవెన్యూ వ్యవస్థలో సముల మార్పులకు శ్రీకారం చుట్టి అమలులో పెట్టినవాడు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. తెలంగాణ భూములకు సంబంధించి నాడు ఎన్టీఆర్ అటువంటి మార్పులకు బీజం వేయకపోతే పరిస్థితి ఈ రోజు ఇంత సులభంగా ఉండేది కాదు.. ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఊరుకో పెద్ద మనిషి
ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చేనాటికి.. ఊళ్లో పెద్దమనిషి ఎవరికి వేయాలని చెబితే వారికే ఓట్లు వేసే పరిస్థితి ఉండేదని, దొరల ఇళ్లకు, వాడలకు మాత్రమే రాజకీయాలు పరిమితమయ్యేవని.. ఎన్టీఆర్‌ వచ్చాక ఆ పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అలాగే.. ఉమ్మడి రాష్ట్రంలో తాలుకా వ్యవస్థ స్థానంలో మండలాలను ఏర్పాటు చేసి అందులో ఉన్న రిజర్వేషన్లను ఎన్టీ రామారావు పెంచి,  కొనసాగించారు. దాంతో స్థానికంగా ఉన్న ఎస్సీ, బీసీ నాయకత్వం బలపడింది. ఆ వర్గాల నుంచి పలువురు నాయకులుగా ఎదిగారు. అలా కొత్త నాయకులు రావడానికి ఎన్టీఆర్‌ దోహదం చేశారు.
మార్పుకు బీజం వేశారు
తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన కాలం నుంచి పటేల్‌, పట్వారీ వ్యవస్థ ఉండేది. వీరంతా జమీందార్లు, జాగీర్‌దార్లకు విధేయులుగా ఉండేవారు. గ్రామంలో రెవెన్యూ వ్యవహారాలన్నీ పట్వారీలకు కంఠోపాఠంగా ఉండేవి. దాంతో వీరు విపరీతమైన అధికారాలను, పెత్తానాన్ని చెలాయించేవారు. ఆ కారణంగా పల్లెల్లో రైతులంతా వీరి కనుసన్నలో మెలిగేవారు. ఇంకా చెప్పాలంటే గజగజలాడేవారు. రైతాంగాన్ని బాగా ఇబ్బందులు పెట్టేవారు. వేధింపులకు గురి చేసేవారు. బలవంతపు వసూళ్లకు పాల్పడేవారు. దీంతో ఈ వ్యవస్థపై ప్రజలకు బాగా కోపం ఉండేది. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చే సమయానికి తెలంగాణ ప్రాంతంలో 16,346 మంది ఈ వ్యవస్థలో ఉండేవారు. ప్రజలను పీడిస్తున్న ఈ పటేల్‌, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్‌ ఒక్క కలంపోటుతో రద్దు చేసి.. వారి స్థానంలో 5,175 మంది పూర్తి కాల గ్రామ సహాయకులను (ఫుల్‌టైమ్‌ విలేజ్‌ అసిస్టెంట్స్‌) తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఎన్టీఆర్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. కొందరు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఎన్టీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకతా రాలేదు సరికదా.. దాన్ని విప్లవాత్మకమైన మార్పుగా దేశమంతా కొనియాడింది.
బీసీలకు పెద్దపీట
భూసంస్కరణలతో భూపంపిణీ జరగడంతో కొద్దోగొప్పో వచ్చిన భూమిని తెలంగాణలోని బడుగు, బలహీనవర్గాలు సాగు చేయడం ప్రారంభించారు. దొరల దగ్గరకు పనికి వెళ్లడాన్ని మానుకున్నారు. దీంతో గ్రామాల్లో ఒక ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకుంది. దీన్ని పరిష్కరించే దిశగా నక్సల్బరి ఉద్యమం పుట్టుకొచ్చింది. అదే సమయంలో.. పల్లెల్లో కంటే పట్టణాలకు వెళితే ఉపాధి దొరకడంతో పాటు డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే అభిప్రాయం పెరిగింది. అలా బడుగు, బలహీనవర్గాల్లోని కొంతమంది ఆర్థికంగా ఎదిగారు. కొన్నిచోట్ల సర్పంచ్‌లు గెలిచారు. సరిగ్గా అటువంటి సమయంలోనే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో వారంతా టీడీపీ అండతో ప్రత్యక్ష రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ వీరికి ఒక వేదికగా మారింది. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తాలూకా వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్స్‌ను 20 శాతానికి, మహిళా రిజర్వేషన్లకు 9 శాతానికి పెంచారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయం బీసీలకు బాగా కలసివచ్చింది. వారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. దాంతో తెలంగాణలో ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాతే రాజకీయాలు మారిపోయాయని..  అప్పటివరకు కొంతమంది పెద్దమనుషులకే పరిమితమైన రాజకీయాలు బడుగు, బలహీన వర్గాల చెంతకు చేరాయనే భావన, ఎన్టీఆర్‌ వల్లే తమకు రాజకీయాల్లో స్థానం కలిగిందన్న భావన బీసీల్లో బలంగా ముద్రపడింది.
రాజకీయ అరంగేట్రానికి..
రాజకీయ అరంగేట్రానికి తెలంగాణను వేదికగా చేసుకున్న ఎన్టీఆర్‌ను.. ఆయన చనిపోయే వరకూ ఈ గడ్డ కడుపులోనే దాచుకుంది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రరాష్ట్రంలో కలిసిపోయిన హైదరాబాద్‌ రాష్ట్రం 1983 వరకూ కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టింది. నియోజకవర్గ పునర్విభజనకు మునుపు తెలంగాణలోని పది జల్లాల్లో 107 నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో సగానికిపైగా స్థానాలను కాంగ్రెస్‌ పార్టీనే కైవసం చేసుకునేది. 1978 ఎన్నికల్లోనూ ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకే జై కొట్టిన తెలంగాణ ప్రజలు.. మహామహులైన స్థానిక నాయకులున్నా రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించారు. కాంగ్రెస్‌ పార్టీకి అంతటి ఘనవిజయాలను అందించిన తెలంగాణ ప్రాంతం.. ఎన్టీఆర్‌ రాజకీయ ఆరంగేట్రం తర్వాత టీడీపీని ఆదరించింది. 1982లో ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకుని.. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వేదికగా  తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల్లో అధికారాన్నీ కైవసం చేసుకున్నారు. టీడీపీ విజయదుందుభి మోగించిన ఆ ఎన్నికల్లో (1983) తెలంగాణలో 107 స్థానాలకుగాను 50 వరకూ స్థానాలను గెలుచుకుంది. అప్పటి వరకూ తెలంగాణలో ఎదురే లేని కాంగ్రెస్‌ పార్టీ 42 స్థానాలకు పడిపోయింది. ఎన్టీఆర్‌ అధికారంలోకి రాగానే తెలంగాణలో పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు, రూ.2కు కిలో బియ్యం వంటి విప్లవాత్మక పథకాలను తీసుకురావడం, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నారు. ఇవి తెలంగాణ ప్రజల్లో ఆయన పట్ల సానుకూలతను పెంచాయి.
టీడీపీలో చీలికను తీసుకువచ్చిన నాదెండ్ల భాస్కర్‌రావు.. 
ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి తాను సీఎం అయినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా  జరిగిన నిరసన కార్యక్రమాల్లో  తెలంగాణ ప్రజలూ పాలుపంచుకున్నారు.  1985లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో టీడీపీ సొంతంగా తెలంగాణ ప్రాంతంలో 59 స్థానాలను దక్కించుకోగా.. కాంగ్రెస్‌ 11 స్థానాలకు పడిపోయింది. అయితే, ఆ తర్వాత జరిగిన 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ తీవ్ర ప్రజావ్యతిరేకత కారణంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కూ.. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఓటమి రుచి చూపించారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మెజారిటీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీకి కట్టబెట్టినా.. టీడీపీ, వామపక్షాల అలయెన్స్‌ను 31 సీట్లలో గెలిపించి గౌరవప్రదమైన సంఖ్యనే అందించారు. టీడీపీకి సొంతంగా 19 సీట్ల వరకూ వచ్చాయి.  ఆ తర్వాత కాంగ్రెస్‌  అంతర్గత రాజకీయాలతో విసుగు చెందిన తెలంగాణ ప్రజానీకం.. 1994 ఎన్నికల్లో తిరిగి ఎన్టీఆర్‌కు బ్రహ్మరథం పట్టింది. టీడీపీ చరిత్రలోనే అత్యధికంగా తెలంగాణలో 68 స్థానాల్లో  విజయం సాధించింది. టీడీపీతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు మరో 20 స్థానాల్లో గెలిచాయి. 1996లో ఎన్టీఆర్‌ గుండెపోటుతో చనిపోయారు. కానీ.. టీడీపీకి తెలంగాణలో ఎన్టీఆర్‌ వేసిన పునాది ఇప్పటికీ ఆ పార్టీ ఉనికిని కాపాడుతోందంటే అతిశయోక్తి కాదు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version