Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగ వాతావరణం లో కొనసాగుతోంది. ఈనెల 27న ప్రారంభం అయింది. రెండు రోజులపాటు సభలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈరోజు మూడో రోజు. చివరి రోజు కావడంతో లక్షలాదిమంది టీడీపీ శ్రేణులు తరలి వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజులపాటు జరిగిన మహానాడు వేదికపై కీలక తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. టిడిపి అధ్యక్ష పదవికి ఎన్నిక జరపగా.. మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకోవైపు నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇటువంటి తరుణంలో ఈరోజు జరుగుతున్న మహానాడు కార్యక్రమం పై అందరిలోనూ ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇంతటి భారీ కార్యక్రమానికి ఇద్దరు టిడిపి సీనియర్లు గైర్హాజరయ్యారు. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. అయితే వారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండడం వల్లే రాలేదని తెలుస్తోంది.
*లక్షలాదిగా హాజరు..
మహానాడు కార్యక్రమానికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుల నుంచి గ్రామస్థాయి నేతల వరకు అంతా హాజరయ్యారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు.. అనంతపురం నుంచి తెలంగాణ వరకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా నేతలు తరలివచ్చారు. అయితే సీనియర్ నేత, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాత్రం మహానాడుకు దూరంగా ఉన్నారు. అయితే తాను ఎందుకు మహానాడుకు రాలేకపోయాను అన్న విషయంపై అయ్యన్నపాత్రుడు వివరణ ఇచ్చారు. ఈ మేరకు వీడియోతో పాటుగా ట్వీట్ చేశారు.’ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 102 జయంతి సందర్భంగా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న బిరుదును ప్రకటించాలని తీర్మానించడం జరిగింది. ప్రతి సంవత్సరం మహానాడుకు వెళ్లి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించే వాడిని. కానీ ఈ సంవత్సరం స్పీకర్ పదవిలో ఉండడంతో మహానాడుకు వెళ్ళలేకపోయినందుకు బాధగా ఉంది. ఈ స్థాయిలో ఈరోజు ఉన్నానంటే దానికి కారణం ఎన్టీఆర్ గారే’ వన్ టూ త్రీ చేశారు.
* రఘురామకృష్ణం రాజు సైతం..
మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా మహానాడుకు వెళ్ళలేదు. ఆయన కూడా రాజ్యాంగబద్ధ పదవి డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. అందుకే మహానాడుకు దూరంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.’ యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రఘురామకృష్ణంరాజు. అయితే ఆయన హాజరు కాకపోవడంతో ఆయన కుమారుడు భరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి తెలుగుదేశం పార్టీకి 20 లక్షల రూపాయల విరాళానికి సంబంధించి చెక్కును అందజేశారు. ఈ విషయాన్ని సైతం రఘురామకృష్ణంరాజు తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.