Kurnool Gold: మార్కెట్లోకి ఆంధ్ర బంగారం వచ్చేసింది. మేడిన్ ఆంధ్ర బంగారానికి మార్కెట్లో చోటు దక్కింది. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి గోల్డ్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఏపీ మ్యాప్ తో పాటు జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరుతో ముద్రవేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబు బజారుకు చెందిన కొందరు వ్యాపారుల దగ్గర ఈ బిస్కెట్లు లభిస్తున్నాయి. బంగారం స్వచ్ఛత తెలిసేలా 999 నెంబర్ కూడా ముద్ర వేశారు. 24 క్యారెట్ల స్వచ్ఛత ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఈ 500 గ్రాముల బిస్కెట్ విలువ అక్షరాల రూ.75 లక్షలు పై మాటే. జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి ప్రస్తుతానికి 100 కిలోలు మాత్రమే ఉత్పత్తి చేసి విక్రయించినట్లు కర్నూలు బంగారం వ్యాపారులు చెబుతున్నారు.
* కొద్దిరోజులు కిందటే ప్రారంభం..
కొద్ది రోజుల కిందటే సీఎం చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమితంగానే ఈ బంగారం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. త్వరలో పూర్తిస్థాయిలో వినియోగదారుల కోసం మార్కెట్లోకి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈనెల 24న సీఎం ప్రారంభించిన వెంటనే కర్నూలుకు చెందిన బంగారం వ్యాపారులు కామిశెట్టి జగదీష్, చక్రవర్తి, శ్రీహరి మూర్తి తో పాటు పలువురు వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ఈ బంగారాన్ని అందుకున్నారు. ఓ వ్యాపారి ఒక గోల్డ్ బిస్కెట్ను వినియోగదారులకు విక్రయించినట్లు కూడా చెప్పారు. అయితే ఏపీ బంగారం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం మాత్రం నిజంగా శుభపరిణామం.
* జువెలరీ క్లస్టర్..
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ తో విదేశీ మరకద్రవ్యం దేశం దాటిపోదాంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎలాంటి పన్నులు, రాయితీలు లేవు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఏ పన్నులు వర్తిస్తాయో.. జొన్నగిరిలో బంగారానికి కూడా వర్తిస్తాయని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ గోల్డ్ మైనింగ్ ప్రారంభం కావడంతో.. జువెలరీ క్లస్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
