Midday Meal Scheme: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు కేజీబీవీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీలో ప్రధానంగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి చర్చ వచ్చింది. మధ్యాహ్న భోజనం ప్రారంభించాలన్న ప్రతిపాదన రావడంతో క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు లక్షణాలపై వేలమంది ఇంటర్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
* అప్పట్లో టిడిపి ప్రభుత్వంలోనే
వాస్తవానికి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. దీంతో లక్షలాదిమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. సాధారణంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గ్రామీణ విద్యార్థులే అధికంగా ఉంటారు. పేద సామాన్య విద్యార్థులు చదువుతుంటారు. వీరంతా ఉదయమే గ్రామాల నుంచి బయలుదేరి కాలేజీలకి చేరుతారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజన పథకం ఉంటే వీరికి ఎంతో ప్రయోజనం. అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడంతో ఎంతో ప్రయోజనకారిగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం పున ప్రారంభించాలన్న విన్నపాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు తిరిగి ఈ పథకం ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
* మంత్రి లోకేష్ చొరవ
పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనఈ కీలక ప్రకటన చేశారు. మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ ఆమోదం ముద్ర లభించడంతో వీలైనంత త్వరగా ప్రారంభించాలని.. ఇంటర్ బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ పథకం అమలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.